
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ అక్తర్‌కు మాతృవియోగం కలిగింది. అక్తర్ తల్లి హమీదా అవాన్ అనారోగ్యంతో కన్ను మూసింది. ఈ విషయాన్ని షోయబ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. హమీదా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన తల్లి మరణించినట్లు అక్తర్ తెలిపాడు. తన తల్లి అల్లా కోసం స్వర్గానికి బయలుదేరిందని ట్విట్టర్‌లో రాశాడు. కాగా ఇస్లామాబాద్‌లో హమీదా అవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో అక్తర్ తల్లి మృతి పట్ల పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు. షోయబ్ అక్తర్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అక్తర్ తల్లి మృతికి సంతాపం తెలిపారు. అలాగే అక్తర్ కుటుంబానికి తన సానుభూతిని తెలియచేశారు. ఈ క్లిష్ట సమయంలో అల్లా షోయబ్ అక్తర్ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకున్నారు. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ కూడా అక్తర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
46 ఏళ్ల షోయబ్ అక్తర్ క్రికెట్ ఆడిన రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతులు విసిరే బౌలర్లలో ఒకడు. 1997 నుంచి 2011 వరకు అంటే 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో 46 టెస్ట్ మ్యాచ్‌లు, 163 వన్డే మ్యాచ్‌లు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 46 టెస్ట్ మ్యాచ్‌ల్లో 178 వికెట్లు తీశాడు. 3.37 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 6 వికెట్లు తీశాడు. అదే ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధికంగా 11 వికెట్లు తీశాడు. ఇక 163 వన్డే మ్యాచ్‌ల్లో 247 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో అత్యధికంగా 6 వికెట్లు తీశాడు. 4.77 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఇక 15 టీ20 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. 8.15తో బౌలింగ్ చేశాడు. ఐపీఎల్‌లో కూడా 3 మ్యాచ్‌లు ఆడిన అక్తర్ 5 వికెట్లు పడగొట్టాడు. 7.71 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా బంతులు వేసిన రికార్డు అక్తర్ పేరు మీదనే ఉంది. 2002లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అక్తర్ ఏకంగా 161 కిలో మీటర్ల వేగంతో బంతులు వేశాడు. ఇక కెరీర్‌లో తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1997 నవంబర్ 29న వెస్టిండీస్‌తో ఆడాడు. చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2007 డిసెంబర్ 8న భారత్‌తో ఆడాడు. తొలి వన్డేను 1998 మార్చి 28న జింబాబ్వేతో ఆడాడు. చివరి వన్డేను 2011 మార్చి 8న న్యూజిలాండ్‌తో ఆడాడు. తొలి టీట్వంటీని 2006 ఆగస్టు 28న ఇంగ్లండ్‌తో ఆడాడు. ఇక చివరి టీ20 మ్యాచ్‌ను 2010 డిసెంబర్ 28న న్యూజిలాండ్‌తో ఆడాడు.