
ఇద్దరు దిగ్గజాల యుద్ధం
"విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం అతనికి బీసీసీఐతో విభేదాలు ఉండటమే. విరాట్ కోహ్లీ ఇది తన నిర్ణయమని చెప్పినా లేదా సౌరవ్ గంగూలీ దీనిపై ఏం ట్వీట్ చేసినా, ఇది ఇద్దరు దిగ్గజాల మధ్య యుద్ధం" అని రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీతో ఉన్న విభేదాలో కోహ్లీ కెప్టెన్సీకి రాజీనామా చేసేలా చేశాయని ఆయన చెప్పుకొచ్చాడు.

భారత క్రికెట్‌ను ప్రభావితం చేశారు
డిసెంబర్లో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం ద్వారా అతని నాయకత్వ బాధ్యతల నుంచి పూర్తిగా తొలగించాలని బీసీసీఐ భావించిందని లతీఫ్ తెలిపాడు. ఇదే సమయంలో కోహ్లీ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో, సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ వంటి కీలక మ్యాచ్‌లు ఓడిపోయిందన్నాడు. అంతేకాకుండా కొంతమంది విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత క్రికెట్‌ను ప్రభావితం చేయగలిగారని లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

కోహ్లీని ఎలా రెచ్చగొట్టాలో తెలుసు
విరాట్ కోహ్లీ ఉద్వేగానికి లోనవుతాడని, అతన్ని ఎప్పుడూ, ఎలా రెచ్చగొట్టాలో కొంత మందికి తెలుసని లతీఫ్ చెప్పాడు. ప్రపంచకప్ తర్వాత టీ20ల్లో భారత్‌కు కెప్టెన్సీ చేయనని ప్రకటించిన తర్వాత ఆ తర్వాతి నెలలో అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించారన్నారు.
వారు కోహ్లీని మాత్రమే కలవర పరచలేదని, భారత క్రికెట్ మొత్తాన్ని అశాంతికి గురిచేశారని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలో కోహ్లీని సంప్రదించాకే కెప్టెన్సీ నుంచి తప్పించామని గంగూలీ చెప్పాడు. వద్దంటే వినకుండా కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని చెప్పాడు. కానీ కోహ్లీ మాత్రం తనను ఎవరూ సంప్రదించలేదని గంగూలీ వ్యాఖ్యలను ఖండించాడు.

వేర్వేరు కెప్టెన్లు కుదరదు
ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీకి దూరమైన విరాట్ కోహ్లీ తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి తనకు తానుగా తప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే రోహిత్ శర్మ వన్డే, టీ20లకు కెప్టెన్‌గా ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమిండియాకు ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా వర్కౌట్ కాదని మరోసారి రుజువు అయిందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.