
హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ పదవికి జులై 30తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే, ఆఖరి రోజు టీమిండియా మాజీ మేనేజర్ లాల్‌ఛంద్ రాజ్‌పుత్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం లాల్‌చంద్ రాజ్‌పుత్ జింబాబ్వే జట్టు కోచ్‌గా ఉన్నారు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఇటీవలే జింబాబ్వే క్రికెట్‌లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ప్రపంచ క్రికెట్ నుంచి జింబాబ్వేను ఐసీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2007లో దక్షిణాఫ్రిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు రాజ్‌పుత్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు.
కెనడాకు వెళ్తూ దుబాయి విమానాశ్రయంలో దరఖాస్తు గడువు ముగియడానికి ముందు ఆఖరి నిమిషంలో లాల్‌చంద్ రాజ్‌పుత్ తన అప్లికేషన్‌ను బీసీసీఐకి పంపారు. రాజ్‌పుత్ గతంలో అప్ఘనిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశారు. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన రాజ్‌పుత్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఆయన పదవీకాల గడువును పెంచింది. కాగా, మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) కోచ్‌ను ఎంపిక చేయనుంది.
ఈ కమిటీలో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిలు సభ్యులుగా ఉన్నారు. మరోవైపు కోచ్‌ల దరఖాస్తులకు తుది గడువుని జులై 30గా బీసీసీఐ నిర్ణయించింది.
టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు మహేళా జయవర్దనేతో పాటు గ్యారీ కిర్‌స్టన్, టామ్ మూడీ, మైక్ హెస్సన్, రాబిన్ సింగ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 13 లేదా 14న హెడ్ కోచ్‌తో పాటు మిగతా సిబ్బందికి క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.