చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై నిలిపిన టార్గెట్ చూసిన చాలా మంది.. ఢిల్లీ గెలవడం గ్యారంటీ అనుకున్నారు. కానీ ఢిల్లీ బ్యాటర్లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
దీంతో ఈ జట్టు చివరకు 27 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. ఈ పరాజయంపై మాట్లాడిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ ఇయాన్ బిషప్ మరోసారి ఢిల్లీపై మండిపడ్డాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చెన్నైతో మ్యాచ్‌లో అక్షర్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను 12 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకుముందు ఆడిన ఇద్దరు బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడటంతో చివర్లో మ్యాచ్ టైట్‌గా మారింది. ఈ క్రమంలో భారీ షాట్లు ఆడబోయిన అక్షర్ అవుటయ్యాడు.
అదే కనుక అక్షర్ కనుక బ్యాటింగ్ లైనప్‌లో కొంచెం ముందు వచ్చి ఉంటే ఢిల్లీ గెలిచి ఉండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. బిషప్ కూడా ఇదే ఓపీనియన్ వెలిబుచ్చాడు. ఒకటి రెండు సార్లు తప్పులు జరగడం సహజమేనని, అయితే ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పాడు. కానీ ఢిల్లీ మాత్రం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోందని విమర్శించాడు.
'ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? అని అర్థం చేసుకోవడం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. దీని వెనుక కారణం ఉందనే అనుకుంటున్నా. కానీ ఒక ఫ్రాంచైజీగా మైదానంలో తీసుకునే నిర్ణయాలను మైదానం బయట నుంచి చూస్తుంటాం. ఒక మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా నోట్స్ తీసుకుంటారు కూడా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. మనం తప్పులు చేయొచ్చు.. వాటి నుంచి నేర్చుకొని మెరుగవ్వాలి కదా' అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది ఆరంభం నుంచి బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా కూడా ఐపీఎల్‌లో అక్షర్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒక్కోసారి ఏడో స్థానంలో ఒక్కోసారి 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచుల్లో 33.37 సగటుతో 267 పరుగులు మాత్రమే చేయగలిగాడు.