టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అని తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది తన చివరి ఐపీఎల్ కాదని ధోనీ పలుమార్లు చెప్పాడు. అయినా సరే అతనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ అని, ఈ విషయంలో ధోనీ ఇప్పటికే చాలా హింట్స్ ఇచ్చాడని మాజీ దిగ్గజం మహమ్మద్ కైఫ్ అంటున్నాడు.
కొన్ని రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో యాంకర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ తన చివరి సీజన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అని ధోనీని అడిగాడు. దీనికి నవ్వేసిన ధోనీ.. 'ఇది నా లాస్ట్ ఐపీఎల్ అని నువ్వు డిసైడ్ చేసేశావుగా' అన్నాడు.

అలాగే తన రిటైర్‌మెంట్ గురించి సీజన్ మధ్యలో ఎలాంటి ప్రకటనా చేయబోనని, అలా చేసి ఫ్రాంచైజీ యాజమాన్యానికి తలనొప్పులు తీసుకురావడం తనకు ఇష్టం లేదని మరోసారి అన్నాడు. అక్కడితో ఆగకుండా ఏదేమైనా ఇది తన క్రికెట్ కెరీర్‌లో చివరి ఫేజ్ అని, దాన్ని ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యమని కూడా చెప్పాడు.
వీటన్నింటి కన్నా కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఘటనను కైఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇది చెన్నై టీంకు ఈ సీజన్‌లో చెపాక్‌లో జరిగే చివరి మ్యాచ్. ఈ క్రమంలోనే మ్యాచ్ తర్వాత లాప్ హానర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ వేగంగా ధోనీని చేరుకున్నాడు.
తను వేసుకున్న షర్ట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. దీన్ని ప్రస్తావించిన కైఫ్.. ''సన్నీ సర్ ఇలా వేరే క్రికెట్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఇప్పటి వరకు మనం చూడలేదు. సునీల్ గవాస్కర్ వంటి గొప్ప ప్లేయర్ ఇలా ఆటోగ్రాఫ్ తీసుకున్నాడంటేనే.. ధోనీ గొప్పతనం అర్థం చేసుకోవచ్చు' అన్నాడు.
అదే సమయంలో ధోనీ తన రిటైర్‌మెంట్ గురించి చాలా హింట్స్ ఇచ్చాడని, అదే సమయంలో ప్రపంచం మొత్తం దీనిప గెస్ గేమ్ ఆడేలా చేశాడని చెప్పాడు. అయితే తన అంచనా ప్రకారం ధోనీ వచ్చే ఐపీఎల్ ఆడటం జరగదని తేల్చేశాడు. మరి ధోనీ ఈ సీజన్ ముగిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.