
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసును ఘనంగా ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచు కోసం సిద్ధం అవుతోంది. ఈ క్రమలో ఢిల్లీలో జరగబోయే ఈ టెస్టులో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తప్పించాలని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. అతని స్థానంలో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలని తేల్చిచెప్పాడు. రెండో టెస్టుకు ముందు ఎవరిని ఆడించాలనే విషయంపై ఒక నిర్ణయానికి వచ్చిన జాఫర్.. తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.
ప్రస్తుతం టీమిండియాలో చెత్త ఫామ్‌లో ఉన్న ఆటగాడు కేఎల్ రాహుల్ అనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది నుంచి చూసుకుంటే.. మూడేళ్లు ఫామ్ లేక తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ కన్నా రాహుల్ రికార్డే చెత్తగా ఉంది. రాహుల్ చివరగా ఒక టెస్టు మ్యాచులో కనీసం హాఫ్ సెంచరీ చేసి ఏడాది దాటింది. గతేడాది సౌతాఫ్రికాలో జరిగిన మ్యాచులో అతను చివరగా హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఏమాత్రం రాణించలేదు. ఇక బంగ్లాదేశ్ సిరీసులో అతని ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కూడా రాహుల్ విఫలమయ్యాడు. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన అతను.. తొలి రోజు చివరి వరకు కూడా క్రీజులో నిలవలేదు. కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతను అవుటైన విషయం కంటే అవుటైన విధానమే నిపుణులకు చిరాకు తెప్పిస్తోంది. దీంతో అతన్ని పక్కన పెట్టడమే మంచిదని పలువురు మాజీలు తేల్చిచెప్పారు. ఇప్పుడు జాఫర్ కూడా అతను ఎంచుకున్న జట్టులో రాహుల్‌కు స్థానం ఇవ్వలేదు. గిల్‌ను ఓపెనింగ్ పంపుతానని చెప్పేశాడు.

గాయంతో జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరాడు. నెట్స్‌లో శ్రమించిన అతను రెండో టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా దాదాపు కన్ఫర్మ్ చేశాడు. అతని కోసం సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అరంగేట్రంలో విఫలమైన సూర్యకుమార్ కన్నా మిడిలార్డర్‌ను బలోపేతం చేసే అయ్యర్‌కే జాఫర్ ఓటేశాడు. అతనిలాగే అరంగేట్రంలో ఫెయిలైన భరత్‌కు మరో అవకాశం ఇచ్చాడు.

తొలి టెస్టులో బ్యాటింగ్‌లో భరత్ విఫలమైన మాట వాస్తవమే. కానీ అంతర్జాతీయ స్థాయిలో అతను బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారని మనం మరువకూడదు. ఒక్క ఫార్మాట్లో కూడా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ ఆడని భరత్.. తన తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవడాన్ని అంత సీరియస్‌గా తీసుకోకూడదు. ఇక వికెట్ కీపర్‌గా మాత్రం భరత్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్ చేసేప్పుడు అతను వికెట్ల వెనుక కదిలిన తీరు అందరికీ నచ్చింది.
జాఫర్ ఎంచుకున్న జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.