మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ భారత తుదిజట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేయవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ వెంటకేశ్ ప్రసాద్ పరోక్షంగా పేర్కొన్నాడు. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి వెస్టిండీస్, యూఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు అమెరికాలో, మిగిలిన సూపర్-8, నాకౌట్ మ్యాచ్‌లు కరేబియన్ దీవుల్లో జరగనున్నాయి.
ఫైనల్‌లో ఓటమిపాలై వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి కప్‌ను దక్కించుకోవాలని కసిగా సిద్ధమవుతోంది. అయితే ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో భారత ప్రపంచకప్ జట్టులో ఎవరుంటారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ప్రతిస్థానానికి కనీసం ఇద్దరు పోటీపడుతుండటంతో సెలక్టర్లకు జట్టు ఎంపిక సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ జట్టుకూర్పు గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

సీనియర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, రింకూ సింగ్ జట్టులో ఉండాలని అన్నాడు. వాళ్లతో పాటు వికెట్ కీపర్ ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ సరిపోతుందని ట్వీట్ చేశాడు. ''స్పిన్నర్లపై భీకర దాడి చేసే సామర్థ్యం ఉన్న శివమ్ దూబె, అంతర్జాతీయ అత్యుత్తమ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, అసాధారణమైన ముగింపును ఇచ్చే రింకూ సింగ్ జట్టులో ఉండాలి. టీ20 ప్రపంచకప్ భారత తుదిజట్టులో ఈ ముగ్గరు ఉంటే అద్భుతంగా ఉంటుంది''
''ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉండటంతో జట్టులో వికెట్‌కీపర్-బ్యాటర్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి జట్టును ఎలా ఎంపిక చేస్తారో వేచి చూద్దాం'' అని వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో గాయపడిన హార్దిక్ టీమిండియాకు దూరమై నెలలు గడిచింది. ఐపీఎల్‌తో తిరిగి పోటీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే బ్యాటింగ్‌లో మునపటిలా హార్దిక్ ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడట్లేదు. అంతేగాక బంతితోనూ హార్దిక్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న హార్దిక్ ఐపీఎల్‌లో ఒత్తిడితో కనిపిస్తున్నాడు. జట్టులోని రోహిత్ శర్మ గ్రూప్ హార్దిక్‌కు సహకరించట్లేదని వార్తలు వస్తున్నాయి.