న్యూఢిల్లీ: వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని శాంతాక్రూజ్‌లోని సూర్య ఆసుపత్రిలో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని శ్రీశాంత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
బుధవారం ఉదయం మాకు పండంటి బాబు పుట్టాడు. సూర్య ఆసుపత్రి వాతావరణం తనకు బాగా నచ్చింది. బాబుకు సూర్యశ్రీ అని పేరు పెట్టినట్లు శ్రీశాంత్ తెలిపారు. రాజస్ధాన్‌లోని జైపూర్ రాజవంశ కుటుంబానికి చెందిన భువనేశ్వరిని శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు. 2013లో శ్రీశాంత్, భువనేశ్వరిలకు మొదటి సంతానంగా పాప జన్మించిన సంగతి తెలిసిందే.

కేరళకు చెందిన శ్రీశాంత్ భారత జట్టు తరుపున 27 టెస్టులు, 53వన్డేలాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2008-10 మధ్య కాలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2011లో కోచి టస్కర్స్, 2013లో రాజస్ధాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2006లో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి శ్రీశాంత్ అరంగేట్రం చేశాడు.
అయితే స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఇక క్రికెట్‌ను పక్కనబెడితే, ఇటీవల ముగిసిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున శ్రీశాంత్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. పాపులర్ టీవీ షో 'జలక్ తిఖ్ లాజా'లో కూడా శ్రీశాంత్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.