
హైదరాబాద్: టీమిండియా మాజీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్‌తో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే మూడేళ్ల పాటు అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఫిజియోగా సేవలందించనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఫర్హార్ట్ కోహ్లీసేనకు ఫిజియోగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్రిక్ ఫర్హార్ట్‌కు ఈ రంగంలో సుమారు ముఫ్పై ఏళ్ల అనుభవం ఉంది. టీమిండియాకు గత నాలుగేళ్లగా తన సేవలను అందిస్తున్నాడు.
గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్‌కూ పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సేవలందించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ప్యాట్రిక్ ఫర్హార్ట్ పేర్కొన్నాడు. ఫర్హార్ట్‌ను తమ బృందంలో చేర్చుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ సీఈఓ ధీరజ్ మల్హోత్రా చెప్పాడు.