
చెన్నై: టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఊర మాస్ ఫాలోయింగ్ ఉందాయనకు. ఓ స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఒకరిద్దరు మినహా ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ మరో క్రికెటర్‌కు లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్, ఇమేజ్ వేరు.
అలాంటి ఎంఎస్ ధోనీ- అంతే క్రౌడ్ పుల్లింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇదివరకే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. దీపావళి పండగను పురస్కరించుకుని దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించబోతోన్నట్లు తెలిపారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు.
రమేష్ తమిళమణి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతోన్నారు. ఆయన రాసిన అథర్వ - ది ఆరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోనీ- తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని రమేష్ తమిళమణి చెప్పారు. ఇందులో నటించే ఆర్టిస్టలు, క్రూ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై వర్కవుట్ చేస్తోన్నట్లు వివరించారు.
కాగా- తమిళంలో తన తొలి సినిమాను తెరకెక్కించిన తరువాత- తెలుగు, మలయాళంలో వరుసగా ఎంఎస్ ధోనీ సినిమాలను పట్టాలెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తోంది. సాక్షి సింగ్ ధోనీ రాసిన ఓ కాన్సెప్ట్ ఆధారంగా ధోనీ తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. ఈ కాన్సెప్ట్‌ను మరింత డెవలప్ చేసే పనిలో ఆయన టీమ్ ఉందని అంటున్నారు.