కోయంబత్తూరు: తను ఓ పాఠశాలను, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు భారత మాజీ టెస్ట్ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన పాఠశాలను ప్రారంభించాలనేది తన కల అని లక్ష్మణ్ చెప్పారు. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసే ఆ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
తాను నెలకొల్పనున్న అకాడమీలో అన్ని రకాల ఆటలకు శిక్షణ ఇవ్వనున్నట్లు, అయితే మొదటి ప్రాధాన్యత మాత్రం క్రికెట్‌కే ఉంటుందని లక్ష్మణ్ చెప్పారు. ఆటలు వ్యక్తిత్వాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. పాఠశాలను ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. తనకు విద్య అంటే ఎంతో మక్కువ అని చెప్పారు.

తాను క్రికెట్ ద్వారా ఎన్నోవిషయాలను నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. క్రికెట్ ద్వారా మంచి, చెడు అనుభవాలను చవిచూసినట్లు లక్ష్మణ్ చెప్పారు. తనకు క్రికెట్ ఇచ్చిన గుర్తింపు పట్ల ఎంతో గర్వంగా ఉన్నానని తెలిపారు.
తన తల్లిదండ్రులు వైద్యులు అని, తనను కూడా వైద్య వృత్తిని చేపట్టాలని వారు కోరుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. ఈ క్రమంలో తను మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకునే సమయంలోనే ఓ కష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదే క్రికెట్‌ను ఎంచుకోవడమని తెలిపారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం మంచి ఫలితాన్నే ఇచ్చిందని ఆయన అన్నారు. తన తండ్రే తనకు రోల్ మోడల్ అని లక్ష్మణ్ అన్నారు.
అయితే మహాత్మాగాంధీ తనకు ఇష్టమైన నాయకుడని, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కూడా గాంధీకి ఉన్న మంచి లక్షణాలున్నాయని చెప్పారు. అహింసా మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మాగాంధీ తనకు ఇష్టమైన నాయకుడని తెలిపారు. క్రికెట్ రంగంలో చూసినట్లయితే సచిన్ టెండూల్కర్.. మహాత్మాగాంధీలా అసూయ, ద్వేషం, హోదాను కోరకుండా ఇతర క్రికెట్ ఆటగాళ్లకు మార్గదర్శిగా మారడని లక్ష్మణ్ అన్నారు.