ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ముగింపునకు చేరుకుంది. ఇన్నిరోజుల పాటు చాలా అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలను మనం చూశాం. కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలి సీజన్లోనే ప్లేఆఫ్ చేరుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాలను ఐపీఎల్ తొలి విజేత రాజస్థాన్ రాయల్స్ ఆక్రమించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదృష్టవశాత్తూ ప్లేఆఫ్ చేరుకుంది. ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ప్లే-ఆఫ్స్ రేసు నుంచి తొలిగేలా ఓడించడంతో ఆర్సీబీ ప్లేఆఫ్ బెర్త్ దక్కించుకుంది. ఇకపోతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మొదటి ప్లే ఆఫ్‌కు ముందు.. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఐపీఎల్ 2022 ఫైనల్స్‌కు చేరుకునే రెండు జట్లు ఏవో అంచనా వేశాడు.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మొదటి ప్లేఆఫ్ గేమ్ (క్వాలిఫైయర్ 1)లో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని చెప్పాడు. అతని ప్రకారం.. ఈ సీజన్లో గుజరాత్, రాజస్థాన్ జట్లు అత్యుత్తమ జట్లు అని చెప్పాడు. ఇకపోతే తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడినప్పటికీ.. క్వాలిఫయర్ 2లో గెలుస్తుందని పేర్కొన్నాడు. తద్వారా ఫైనల్లో మళ్లీ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందని స్వాన్ పేర్కొన్నాడు. ఇకపోతే ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్లకు చేరిన మొదటి జట్టుగా గుజరాత్ నిలిచింది. లీగ్ దశ తర్వాత 14మ్యాచ్‌ల్లో 20పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు ప్రస్తుతం ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలుగా ఉన్న జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్‌ల అద్భుతమైన ప్రదర్శనతో పాటు జట్టు సమిష్టిగా రాణిస్తుండడంతో రాజస్థాన్ రాయల్స్ టాప్ 2పొజిషన్లో నిలిచి క్వాలిఫయర్ 1 బెర్త్ కన్ఫం చేసుకుంది.
అయితే కోల్ కతాలో వాతావరణ పరిస్థితులు ఏమాత్రం బాలేవు. దీంతో వాన ముప్పు గనుక ఈ మ్యాచ్‌కు ఉంటే గుజరాత్ టైటాన్స్‌కే ఫేవర్ అవుతుంది. వాన వల్ల మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే.. గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్ చేరుతుంది. లేకపోతే మ్యాచ్ జరిగినట్లయితే గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడానికి మరొక అవకాశాన్ని పొందుతుంది. బెంగళూరు, లక్నోల మధ్య జరిగే ఎలిమినేటర్ ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో ఓడిన జట్టు తలపడుతుంది. అక్కడ కూడా ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే ఫైనల్లో మళ్లీ క్వాలిఫయర్ 1విజేతతో తలపడుతుంది.