
ఇంగ్లండ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ రే ఇల్లింగ్‌వర్త్ కన్నుమూశారు. 89 ఏళ్ల ఇల్లింగ్‌వర్త్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఇంగ్లండ్‌లోని కౌంటీ జట్టు అయినా యార్క్‌షైర్ ప్రకటించింది. ఇటీవలనే ఇల్లింగ్‌వర్త్ అన్నావాహిక క్యాన్సర్‌కు రేడియోథెరపీ కూడా చేయించుకున్నారు. ఇల్లింగ్‌వర్త్ భార్య షిర్లీ కూడా గత ఏడాదే క్యాన్సర్‌తో చనిపోయింది. 1932 జూన్ 8న జన్మించిన ఇల్లింగ్‌వర్త్ క్రికెట్‌కు చాలా కాలంపాటు సేవ చేశారు. 1951 నుంచి 1983 వరకు 32 సంవత్సరాలపాటు క్రికెట్ ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్ల పాటు ఆడారు.
ఇంగ్లండ్ తరపున 1958లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇల్లింగ్‌వర్త్ 1973 వరకు కొనసాగారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తరఫున 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1836 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 113 పరుగులు. 61 టెస్ట్ మ్యాచ్‌ల్లో 122 వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలు అందించారు. ఇక 3 వన్డేలు మాత్రమే ఆడిన ఇల్లింగ్‌వర్త్ 4 వికెట్లు తీశారు.
రే ఇల్లింగ్‌వర్త్ 31 టెస్ట్ మ్యాచ్‌లకు ఇంగ్లండ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 1970-71లో ఆస్ట్రేలియా వెళ్లిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 2-0తో గెలుచుకుంది. 1993-96 మధ్య కాలంలో ఇంగ్లండ్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. 1995-96 మధ్య కాలంలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 24,134 పరుగులు చేశాడు. 2,072 వికెట్లు పడగొట్టాడు.
1960లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను కౌంటీలో యార్క్‌షైర్ జట్టు తరఫున ఆడాడు. కాగా రే ఇల్లింగ్‌వర్త్ మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, యార్క్‌షైర్ యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించాయి. ఈ సందర్భంగా రే ఇల్లింగ్‌వర్త్ ఒక మంచి క్రికటర్ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొనియాడింది. ఆట పట్ల అతనికి ప్రగాఢమైన ప్రేమతోపాటు మంచి ప్యాషన్, జ్ఞానం ఉండేదని చెప్పుకొచ్చింది. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక కూడా రే ఇల్లింగ్‌వర్త్ ఆటకు అనేక సేవలు చేశాడని ప్రశంసించింది.