
ఐపీఎల్ 2022లో వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ మద్దతుగా నిలిచాడు. ఓటముల విషయమై రోహిత్ శర్మను తప్పుపట్టాల్సిన అవసరం లేదని, అతడిని విమర్శించడం తగదని ఆయన అన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని శంకించడం పట్ల తాను సంతోషంగా లేనని చెప్పాడు. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారని, దీంతో ముంబై బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిందని తెలిపాడు. మధ్య ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి వికెట్ తీసే వరకు ఆ జట్టు పరిస్థితి దారుణంగా ఉందని గుర్తు చేశాడు. అలాంటప్పుడు రోహిత్ శర్మను ఒక్క క్షణం కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. తొలి 10 ఓవర్లలో రోహిత్ శర్మ ఎవరి చేత బౌలింగ్ చేయించిన బెడిసికొట్టిందని గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు. బౌలర్లు అంతా విఫలైమైనప్పుడు రోహిత్ శర్మ ఏం చేయలేడన్నాడు.
కాగా ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓడి సీజన్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 5 సార్లు ఛాంపియన్ ఇలా ఓడిపోవడం ఎవరికీ మింగుడు పడడం లేదు. ఈ ఓటములకు ఆ జట్టు బౌలింగ్ యూనిట్ బలహీనంగా ఉండడం ప్రధాన కారణంగా పలువురు చెబుతున్నారు. ఆ జట్టులో జస్ప్రీత్ బుమ్రా మినహా మరో సరైన బౌలర్ లేడని అంటున్నారు. మొత్తానికి ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం అభిమానులకు మరింత నిరీక్షణ తప్పడం లేదు.

ఇక బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్ (70), మయాంక్ అగర్వాల్ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ముంబై ఇండియన్స్ 9 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసింది. డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రాణించినప్పటికీ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.