
ఉత్తరప్రదేశ్: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు పితృ వియోగం కల్గింది. ఆయన తండ్రి త్రిలోక్‌చంద్ రైనా.. క్యాన్సర్‌తో పోరాడుతూ నేడు కన్నుమూశారు. త్రిలోక్‌చంద్ రైనా సైన్యంలో పని చేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో కూడా ఆయన మంచి ప్రావీణ్యం సంపాదించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న త్రిలోక్ చంద్ రైనా నేడు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తన నివాసంలో కన్ను మూశారు. త్రిలోక్‌చంద్ రైనా మొదట జమ్మూకశ్మీర్‌లోని రైనావారి ప్రాంతంలో నివాసం ఉండేవాడు. అయితే 1990లలో కాశ్మీర్ పండిట్ల హత్యల తర్వాత ఆయన తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి ఉత్తరప్రదేశ్ వలస వచ్చారు. ఘజియాబాద్ జిల్లాలో గల మురాద్‌నగర్ పట్టణంలో స్థిరపడ్డారు. అప్పుడు ఆయనకు నెలకు 10 వేల రూపాయలు జీతం వచ్చేది. అయితే ఆ జీతం సురేష్ క్రికెట్ కోచింగ్‌కు సరిపోయేది కాదు. ఆ తర్వాత 1998లో రైనా లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చేరాడు. కాశ్మీర్ విషాదం గురించి తన తండ్రికి గుర్తుకు తెచ్చే విషయాలేవీ ప్రస్తావించకుండా జాగ్రత్తపడతానని రైనా చెబుతుండేవాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2010లో అడుగుపెట్టిన సురేష్ రైనా 9 ఏళ్ల పాటు టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగాడు. మంచి మిడిలార్డర్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు రాబట్టేవాడు. అవసరమైనప్పుడు బౌలర్‌గానూ రాణించేవాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా సురేష్ రైనా నిలిచాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో 226 వన్డే మ్యాచ్‌లు ఆడిన 35 సగటుతో 5615 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 116 పరుగులు. ఇక 18 టెస్ట్ మ్యాచ్‌ల్లో 26 సగటుతో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 120 పరుగులు. ఇక 78 టీ20ల్లో 29 సగటుతో 1604 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 101 పరుగులు. ఇక ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులు.