
ప్రస్తుతం టీమిండియాకు అనేక మంది పేస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ప్లేయింగ్ 11లో ఒక్క సారి చోటు కోల్పోతే కొత్త వాళ్ల దూకుడుతో మళ్లీ జట్టులోకి రావడం కష్టమనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. దీంతో రానున్న ఐసీసీ టోర్నీలను దృష్టిలో పెట్టుకోని భారత జట్టులో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సూచించారు. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించాలని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువనేశ్వర్ పేలవ ఫామ్‌పై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత జట్టులో ఎవరిని తొలగించాలని అడిగితే నేను మొదటగా భువనేశ్వర్ చెబుతునానని ఆయన తెలిపారు. అతనికి ఇంకా భవిష్యత్ ఉందని తనకు అనిపించడం లేదని చెప్పుకొచ్చాడు. భువి బౌలింగ్‌లో గతంలో ఉన్న పస లేదని, అతని పేస్‌లో పదును లేదని గవాస్కర్ మండిపడ్డారు. అతను బౌలింగ్ చేస్తున్న విధానం బాగా లేదని అన్నాడు. భువిని తొలగించడానికి ఇక సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. భువనేశ్వర్ బ్రేక్ తీసుకోని, మళ్లీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సునీల్ గవాస్కర్ అన్నారు. భువీ స్థానంలో శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. దీపక్ చాహర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. దీపక్ చాహర్ బంతిని స్వింగ్ చేయగలడని, అదే సమయంలో బ్యాట్‌తోనూ రాణించగలడని సునీల్ గవాస్కర్ తెలిపారు.
కాగా 2019 నుంచి భువనేశ్వర్ కుమార్ వరుస గాయాలతో బాధపడుతున్నాడు. 2020 ఐపీఎల్ సీజన్లో గాయాల కారణంగా టోర్నీ నుంచి అర్ధారంతరంగా తప్పుకున్నాడు. గాయాల నుంచి కోలుకున్నాక మునుపటి మాదిరిగా భువి బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఫామ్‌లో లేకపోవడంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా భువికి తమ రిటెన్షన్ జాబితాలో చోటు కల్పించలేదు. దీంతో భువి ఈ సారి వేలానికి రానున్నాడు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో భువిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందనే ఆసక్తి నెలకొంది. కాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్ ఎంపిక కాకపోయినప్పటికీ, టీ20 సిరీస్‌కు మాత్రం భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు.