ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఇప్పటికిప్పుడు టీమిండియా జట్టును ప్రకటించిన అందులో యువ పేసర్ హర్షల్ పటేల్ పేరు కచ్చితంగా ఉంటుందని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికిప్పుడు జట్టును ప్రకటిస్తే అందులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరుతోపాటు యువ పేసర్ హర్షల్ పటేల్ పేరు కూడా కచ్చితంగా ఉంటుదని ఆయన చెబుతున్నాడు. అయితే హర్షల్ పటేల్‌తో ఎక్కువగా బౌలింగ్ చేయిస్తే ప్రత్యర్థులు అతడు బౌలింగ్ చేసే విధానాన్ని అర్థం చేసుకుంటారని అంటున్నాడు. అందుకే టీ20 ప్రపంచకప్ కోసం హర్షల్ పటేల్‌తో ఎంత తక్కువగా బౌలింగ్ చేయిస్తే అంత మంచిదని అజయ్ జడేజా పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా పిచ్‌లపై హర్షల్ పటేల్ రాణించగలడని అజయ్ జడేజా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. విశాలంగా ఉండే ఆసీస్ పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయన తెలిపాడు. హర్షల్ పటేల్ జట్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడని అన్నాడు. వెస్టిండీస్‌తో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ అవసరమైన ప్రతిసారి హర్షల్ పటేల్‌కే బౌలింగ్ ఇచ్చాడని గుర్తు చేశాడు. అయినప్పటకీ హర్షల్ పటేల్ ఏ మాత్రం తడబడకుండా రాణించి, వికెట్లు తీయడంతోపాటు కెప్టెన్‌కు తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని అజయ్ జడేజా అన్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లాగే గొప్పగా ఆడాడని కొనియాడాడు. అతను వేసిన స్లో బంతులను ఎదొర్కొలేక బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారని, అది చూస్తే తనకు ఆశ్చర్యకరంగా ఉందని అజయ్ జడేజా చెప్పాడు.
కాగా వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. కెరీర్లో ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 5 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హర్షల్ పటేల్ 9 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 63 మ్యాచ్‌లు ఆడి 78 వికెట్లు తీశాడు. కాగా ఆదివారం వెస్టిండీస్‌తో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.