వెస్టిండీస్ టూర్‌తో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను టీమిండియా మొదలు పెట్టనుంది. అయితే ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ కనుక టీమిండియా చేరితే.. కెప్టెన్ రోహిత్ శర్మకు 38 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. అతను అప్పటి వరకు ఆడతాడో లేదో కూడా చెప్పలేం. ఈ క్రమంలోనే టెస్టుల్లో రోహిత్ వారసుడి కోసం సెలెక్టర్లు వెతుకుతున్నారు. దీనిపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ తర్వాత కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి? అని సెలెక్టర్లు వెతుకుతుంటే.. మళ్లీ కోహ్లీకే పగ్గాలు ఇవ్వవచ్చు కదా అని ప్రసాద్ అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా టెస్టు క్రికెట్‌కు తన ఎనర్జీతో ఊపిరి ఊదిన కెప్టెన్ కోహ్లీ. అతను టెస్టు కెప్టెన్ అయిన తర్వాతనే ఈ ఫార్మాట్‌కు పాపులారిటీ పెరిగింది. అయితే గతేడాది సౌతాఫ్రికా చేతిలో సిరీస్ ఓటమి తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు.

ఒకవేళ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాండ్యాకు పగ్గాలు అందించినా.. టెస్టుల్లో రోహిత్‌ను కొనసాగించే అవకాశం ఉందా? అని అడిగితే.. దానిపై కూడా ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశాడు. సెలెక్టర్లు కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను (2023-25)ను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్‌ను సెలెక్ట్ చేస్తారని చెప్పాడు. విండీస్‌తో జరిగే టీ20 సిరీసులో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. వన్డే ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న సంగతి తెలిసిందే.
'ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వడం కుదరదేమో? సెలెక్టర్ల మైండ్‌సెట్ ఎలా ఉందో నాకు తెలీదు. సాధారణంగా అయితే కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌పై వాళ్ల ఫోకస్ ఉండాలి. ఈ సైకిల్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి' అని ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. అలాగే రహానేకు మళ్లీ వైస్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు, కోహ్లీని తిరిగి టెస్టు కెప్టెన్ చేయడంలో సమస్యేంటని అతను ప్రశ్నించాడు.
'రహానే పునరాగమనం చేసి మళ్లీ వైస్ కెప్టెన్ అయినప్పుడు.. మళ్లీ కోహ్లీని కెప్టెన్ ఎందుకు చేయకూడదు? కెప్టెన్సీ విషయంలో విరాట్ ఆలోచన ఎలా ఉందో నాకు తెలీదు. కానీ రోహిత్ తర్వాత ఎవరు? అని కనుక సెలెక్టర్లు ఆలోచిస్తుంటే మాత్రం.. విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి ఆప్షనే' అని ప్రసాద్ తేల్చిచెప్పాడు.