
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో తలపడి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూఘోర పరాజయాన్ని పొందిన టీమిండియాపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా సమావేశంలో పాల్గొన్న భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ సహనాన్ని కోల్పోయాడు. 'ఉత్తమ జట్టు ఏదో మీరే చెప్పండి దాంతోనే మేము ఆడతాం' అని కోపంగా చెప్పడంతో ఆ విషయం కాస్తా పలు విమర్శలకు తావిచ్చింది.
ఈ విషయం స్పందించిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఓ కెప్టెన్ గా ముందు మాట్లాడటం నేర్చుకో. మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం చాలా మూర్ఖత్వం అని విరాట్ కోహ్లీపై ఆరోపణలు గుప్పించాడు. అతనితో పాటు భారత మాజీ క్రికెటర్ అయిన మదన్ లాల్ 'కోహ్లీ సహనాన్ని కోల్పోవద్దు. నిజం చెప్పాలంటే సెంచూరియన్‌లో నిర్వహించిన మీడియో సమావేశం అసలు లెక్కలోకే రాదు. ఒకవేళ చివరి టెస్టులోనూ ఓడిపోతే నీకు మరిన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. సిద్ధంగా ఉండు' అని మదన్‌లాల్ సూచించాడు.
అసలేం జరిగిందంటే:
దక్షిణాఫ్రికాతో ఆడి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ 2-0తేడాతో ఓటమి పాలైన భారత జట్టు అసహనానికి గురై ఉంది. ఈ నేపథ్యంలో అప్పటికే పలు ప్రశ్నలకు విసుగ్గా స్పందించిన కోహ్లీ చివరి ప్రశ్నకు ఘాటుగానే స్పందించాడు. 'భువనేశ్వర్‌ను తొలగించి షమీని జట్టులోకి తీసుకున్నాం. అతను ఉత్తమమైన ప్రదర్శనే ఇచ్చాడు. దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. కేవలం మ్యాచ్ పరాజయం గురించే మాట్లాడుతున్నారంటూ' వ్యంగ్యంగా బదులిచ్చాడు.
సమావేశంలో ఓ జర్నలిస్టు అయితే మీరు అత్యుత్తమ జట్టునే ఎంచుకుని మ్యాచ్‌కు సిద్ధమయ్యారా. అయినా ఎలా విఫలమయ్యారు అని అడగడంతో ఆవేశంలో సమాధానమిచ్చాడు. మీరే నిర్ణయించండి అత్యుత్తమం జట్టు ఏదో దాంతోనే మేము ఆటను కొనసాగిస్తాం అని బదులిచ్చాడు.
దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనున్న తదుపరి మూడోది ఆఖరుది అయినటువంటి టెస్ట్ మ్యాచ్‌కు జోహన్నస్‌బర్గ్ వేదిక కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.