ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భారత బ్యాట్స్ మెన్ వరుస వైఫల్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. టాప్ ఆర్డర్ లో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ను మినహాయిస్తే నమ్మకమైన బ్యాట్స్ మెన్ కనిపించడం లేదు. ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి సెంచరీతో ఆదుకోకపోతే మెల్ బోర్న్ టెస్టులో ఓటమి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించలేని పరిస్ధితి. ఈ దెబ్బకు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్ అయ్యేందుకు సిద్దమవుతున్నాడు.
అయితే టీమిండియాకు ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది, బ్యాట్స్ మెన్ వరుస తప్పిదాల వెనుక కారణం ఏంటి, రోహిత్ శర్మ సిడ్నీలో ఏం చేయాలి.. ఇలా పలు అంశాలపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మైఖేల్ పోర్టల్ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ వైఫల్యానికి గల కారణాన్ని అజారుద్దీన్ గుర్తించారు. అలాగే సిడ్నీ టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ ఏ అంశాలపై ఫోకస్ పెట్టాలో కూడా చెప్పేశారు.

ప్రస్తుత పరిస్ధితుల్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సమం చేయడం కష్టమైన పనే అని అజారుద్దీన్ తేల్చిచెప్పేశాడు. బ్యాట్స్ మెన్ వరుస తప్పులు చేస్తున్నారని, ముఖ్యంగా షాట్ల ఎంపికలో పొరబాట్లను మళ్లీ మళ్లీ చేస్తున్నారని తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడంలో వైఫల్యం, భాగస్వామ్యాలను నిర్మించడంలో అసమర్థత వంటి అంశాలు భారత్ కు అసలైన లోపాలుగా మారాయన్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే భారత్ ఆటతీరుతో గణనీయంగా మార్పులు రావాల్సి ఉంటుందని అజారుద్దీన్ తెలిపారు. అలాగే సిరీస్ డ్రా చేసుకోవడం కూడా ఇప్పుడు కత్తిమీద సాము అన్నాడు. ఆస్ట్రేలియా కఠినమైన ప్రత్యర్థే అయినా భారత జట్టు కోలుకునే అవకాశం ఉందని, అయితే బ్యాటింగ్ లో రిపీట్ అవుతున్న సమస్యలను పరిష్కరిస్తేనే ఇది సాధ్యమని తేల్చిచెప్పేశాడు. ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే రోహిత్ శర్మకు సిడ్నీ టెస్టు మరింత కీలకం అవుతుందన్నాడు. అలాగే కొహ్లీ కూడా స్వింగ్ బంతుల్ని ఎదుర్కొనేందుకు క్రీజు బయటికి వెళ్లకుండా లోపలే ఉండి ప్రయత్నించాలని అజార్ సూచించాడు.