అసలేం జరిగింది?: ధోనిని తప్పించాలని చూశారు, అడ్డుకున్న శ్రీని
హైదరాబాద్: ధోని నేతృత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన అనంతరం 2012లో ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అప్పటి జాతీయ సెలక్టర్ మొహిందర్ అమర్‌నాథ్ ప్రయత్నించాడని అయితే అతడి నిర్ణయానికి తాను అడ్డుకున్నానని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ చెప్పాడు.
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రచించిన 'డెమోక్రసీస్ ఎలెవన్' పుస్తకంలో ఈ అంశంపై ఎన్ శ్రీనివాసన్ స్పందించాడు. 2012లో మొహిందర్ అమర్‌నాథ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కెప్టెన్‌గా ధోనిని తప్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకున్నానని శ్రీనివాసన్ చెప్పాడు.

బోర్డు అధ్యక్షుడి హోదాలో ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నా
'ధోని నేతృత్వంలోని టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాతి ఏడాది అతడిపై వేటు వేయాలని నిర్ణయించారు. బోర్డు అధ్యక్షుడి హోదాలో ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నాను. అలా చేయడాన్ని పక్షపాతం అంటారేమో, నేను మాత్రం ఓ టాప్ క్రికెటర్‌కు ఇచ్చిన గౌరవమంటాను' అని రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో శ్రీనివాసన్ చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.

మ్యాచ్ ఫిక్సింగ్‌లో తన పాత్రపై అనుమానాలు
ఇక, 2013లో ఐపీఎల్‌లో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్‌లో తన పాత్రపై అనుమానాలు వ్యక్తం కావడం, తన కెరీర్‌లో అత్యంత కఠిన దశ అని ధోని పేర్కొన్నాడు. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం విచారణలో భాగంగా ఓ బుకీ.. ధోని, రైనా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

‘డెమోక్రసీస్ ఎలెవన్' పుస్తకంలో ధోని
దీనిపై అప్పట్లో మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీనిపై రాజ్‌దీప్ సర్దేశాయ్ రచించిన ‘డెమోక్రసీస్ ఎలెవన్' పుస్తకంలో ధోని స్పందించాడు. 'ఆట గురించి నన్ను విమర్శించండి తప్పు లేదు. అంతే గానీ ఫిక్సర్‌నని ఎలా ఆరోపిస్తారు. నేనిప్పుడు ఇలా ఉన్నానంటే అంతా క్రికెట్ వల్లే' అని ధోని అన్నాడు.

శ్రీనివాసన్ భారత క్రికెట్‌కు నిజమైన సపోర్టర్
ఇక మీడియా మాత్రం నిప్పు లేనిదే పొగ రాదంటూ కథనాలను ప్రచురించడం తనకు ఎంతో వింతగా అనిపించిందని పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే తాను మీడియాతో మాట్లాడేందుకు అస్సలు ఇష్టపడనని ధోని చెప్పుకొచ్చాడు. ఇక, శ్రీనివాసన్ భారత క్రికెట్‌కు నిజమైన సపోర్టర్ అని అన్నాడు. 'ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోను. క్రికెటర్లకు సాయం చేసే విషయంలో శ్రీనివాసన్ ఎప్పుడూ ముందుంటాడు' అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications