
ఢాకా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో ఘోరంగా విఫలమైన జట్టు- బంగ్లాదేశ్. అంచనాలకు ఏ మాత్రం అందని విధంగా సాగిందీ జట్టు ప్రస్థానం. గ్రూప్-బీలో ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. సూపర్-4 దశకు చేరుకోలేక చేతులెత్తేసింది. పసికూన హాంకాంగ్‌తో కలిసి ఇంటిదారి పట్టింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఆసియా కప్ 2022 మలి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ ఓటమి ఎఫెక్ట్ బంగ్లాదేశ్‌పై పడింది. మాజీ కేప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడానికి కారణమైంది. కొద్దిసేపటి కిందటే అతను తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. వన్డే, టెస్ట్ ఫార్మట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై ఈ సమాచారాన్ని పోస్ట్ చేశాడు.

ఆసియా కప్‌లో ముష్ఫికుర్ రహీం చేసిన పరుగులు.. అయిదు. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై, అనంతరం శ్రీలంకపై దారుణంగా ఓడింది బంగ్లాదేశ్. ఆఫ్ఘనిస్తాన్‌పై 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ముష్ఫికుర్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లోనూ రహీం రాణించలేకపోయాడు. నాలుగు పరుగులు చేసి కరుణరత్నె బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. డూ ఆర్ డై మ్యాచ్ అది.
ఈ రెండింట్లోనూ విఫలమైన ప్రభావం రహీంను టీ20ల్లో కొనసాగడంపై పునరాలోచన చేసే దిశగా ప్రేరేపించింది. వన్డే, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని, ఈ రెండు ఫార్మట్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. లీగ్ మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు అతను బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున 102 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. 1500 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 19.23.