
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డగ్ బొలింగర్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌కు ముందు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు. 36 ఏళ్ల బొలింగర్ ఆస్ట్రేలియా తరపున 12 టెస్టులాడి 25.92 యావరేజ్‌తో 50 వికెట్లు తీశాడు.
2009లో ఆస్ట్రేలియా తరపున టెస్టు అరంగ్రేటం చేసిన బొలింగర్ చివరి మ్యాచ్ 2010లో ఇంగ్లాండ్‌పై ఆడాడు. ఇక, 39 వన్డేలాడి 23.90 యావరేజ్‌తో 60 వికెట్లు తీశాడు. వన్డేల్లో 2010లో న్యూజిలాండ్‌పై 5/28 అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. అలాగే తన చివరి వన్డే మ్యాచ్‌ని 2011లో దక్షిణాఫ్రికాపై ఆడాడు.
9 టీ20 మ్యాచ్‌లాడి 9 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్ వేల్స్ తరుపున ఆడిన బొలింగర్ 290 వికెట్లు తీశాడు. ఇక బిగ్ బాష్ లీగ్ టోర్నీలో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రిటైర్మెంట్ ప్రకటనం అనంతరం బొలింగర్ మీడియాతో మాట్లాడాడు.
'తన జీవితంతో ఎంతో గొప్ప వ్యక్తులను కలిశానని, అలాగే ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పాడు. ప్రపంచ క్రికెట్లో గొప్ప కెప్టెన్లుగా పేరొందిన స్టీవ్‌వా, రికీ పాంటింగ్, క్లార్ కెప్టెన్సీల్లో ఆడటాన్ని మరిచిపోలేని అనుభూతిగా చెప్పాడు.
రిటైర్మెంట్ అనంతరం మిగతా సమయాన్ని భార్య, పిల్లలతో గడుపుతానని చెప్పుకొచ్చాడు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బొలింగర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.