Bob Simpson Passes Away: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ 89 ఏళ్ల వయసులో సిడ్నీలో కన్నుమూశారు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా తనదైన ముద్ర వేశారు. అలాగే జట్టు నిర్మాతగా, రిఫరీగా, వ్యాఖ్యాతగా కూడా ఆయన సేవలు అందించారు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇది తీరని లోటని క్రికెట్ ఆస్ట్రేలియా తన ప్రకటనలో తెలిపింది.
బాబ్ సింప్సన్ క్రికెట్ ప్రస్థానం
బాబ్ సింప్సన్ 1957లో ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టులో చేరారు. 1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్ సంక్షోభం తర్వాత 41 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా ఉండేది. దానిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గొప్ప రన్ స్కోరర్. 1960లలో బిల్ లారీతో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఆ తర్వాత ఆయనను ఆస్ట్రేలియా ఫుల్-టైమ్ కోచ్‌గా నియమించింది.

బాబ్ సింప్సన్ రికార్డులు, విజయాలు
1964లో ఇంగ్లండ్ జట్టుపై 311 పరుగులు చేసి టెస్టుల్లో ట్రింపుల్ సెంచరీ సాధించిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచారు. స్లిప్ ఫీల్డర్ గా కూడా ఆయనకు గొప్పపేరుంది. 62 టెస్టుల్లో 110 క్యాచ్‌లతో రికార్డు సృష్టించారు. 1964లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1968లో రిటైర్ అయ్యారు.
కోచ్‌గా అద్భుతమైన సేవలు
ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత 1986-1996 మధ్య ఆస్ట్రేలియాకు కోచ్‌గా గొప్ప సేవలు అందించారు. ఆస్ట్రేలియా మొదటి పూర్తి-కాల్ కోచ్‌గా ఆయన ఆ దేశ క్రికెట్ కు ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారు. ఆయన కోచింగ్‌లో ఆస్ట్రేలియా 1987లో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. 1989లో యాషెస్‌ను తిరిగి పొందింది. 1995లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. వెస్టిండీస్‌పై 17 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా ఈ విజయం సాధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. 2007లో ఆయనకు ఆస్ట్రేలియా క్రికెట్‌కు చేసిన సేవలకుగాను "ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా" అవార్డు లభించింది.