
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2021లో ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కొన్న భారత్.. ఆపై న్యూజీలాండ్ చేతిలో కూడా ఓటమిపాలైంది. దాంతో కోహ్లీసేన సూపర్ 12 నుంచే ఇంటిదారి పట్టే పరిస్థితి ఏర్పడింది. సూపర్ 12లో మిగిలిన మ్యాచులో గెలిచినా.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంది. ఇక వరుస ఓటముల కారణంగా టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పాక్ జట్టుపై ఓడినందుకు నెటిజన్లు ఆటగాళ్లపై మండిపడుతున్నారు.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన సందర్భంగా సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిది నెలల కుమార్తెపై బెదిరింపులు వచ్చాయి. 9 నెలల వామికతో సహా కోహ్లీ భార్య అనుష్క శర్మపై కూడా అసభ్యకర కామెంట్లు చేశారు. ఈ క్రమంలో కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారంటూ ఆయన మంగళవారం సాయత్రం ఓ ట్వీట్ చేశారు. 'ప్రియమైన విరాట్ కోహ్లీ.. ఈ వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారు. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వను. వారిని క్షమించండి.. భారత జట్టును రక్షించండి' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
విరాట్ కోహ్లీ కూతురు వామిక ఫొటోలను వెంటనే విడుదల చేయాలని, అవి బయటపడిన తర్వాత పాపపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ) తీవ్ర స్థాయిలో సీరియస్ అయింది. ఈ బెదిరింపులను సుమోటోగా తీసుకుంది. బెదిరింపులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, గుర్తించిన నిందితులు, వారిలో అరెస్టయిన వారి వివరాలు అందించాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరింది. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలను వివరిస్తూ.. నవంబరు 8లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
భారత జట్టు పేలవ ప్రదర్శనకు గాను గతంలో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మను నెటిజన్లు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అనుష్కను ఓ ఆటాడుకున్నారు. అయితే ఇప్పుడు హద్దులూ దాటుతూ అభంశుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వారిలోని పశుతత్వాన్ని చాటుతోందంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులను అరికట్టేలా కఠిన చట్టాలు తేవాలని ప్రభుత్వాన్ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైన సందర్భంలో ఎంఎస్ ధోనీ కూతురు జీవాకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే.