
ఏ ఫార్మట్‌లోనైనా..
అలాంటి జింబాబ్వే.. ఇప్పుడు చరిత్ర తిరగరాసింది. మేటి జట్టు ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను మూడు ఓడించింది. ఆస్ట్రేలియా గడ్డపై జింబాబ్వే జట్టు సాధించిన మొట్టమొదటి విజయం ఇది. ఏ ఫార్మట్‌లో అయినా ఇదే తొలి గెలుపు. టెస్టుల్లో గానీ, వన్డే ఇంటర్నేషనల్స్ గానీ, టీ20ల్లో గానీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టును జింబాబ్వే ఓడించిన సందర్భాలు లేవు. తాజాగా ఆ కొరతను భర్తీ చేసుకుంది.

మూడో వన్డేలో..
ప్రస్తుతం జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఓడింది. మూడో వన్డేలో మాత్రం విజృంభించింది. తన ప్రధాన బలమైన బౌలింగ్‌లో రెచ్చిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 141 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఏడు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 142 పరుగులతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.

ర్యాన్ బర్ల్ ఫైర్..
జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్- అయిదు వికెట్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరగ్గొట్టాడు. మూడే మూడు ఓవర్లు విసిరిన ర్యాన్ బర్ల్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లను నేలకూల్చాడు. అతని బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒక్క ఫోర్, ఒక్క సిక్స్ గానీ కొట్టలేకపోయారంటే లెగ్ స్పిన్ మేజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, చిచ్చరపిడుగు గ్లెన్ మ్యాక్స్‌వెల్, అష్టన్ అగర్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వికెట్లు తీసుకున్నాడు.

వార్నర్ ఒక్కడే..
ఆస్ట్రేలియాలో డేవిడ్ వార్నర్ ఒక్కడే జింబాబ్వే బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. 96 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. లోయర్ మిడిలార్డర్‌లో గ్లెన్ మ్యాక్స్ మాత్రమే 19 పరుగులతో డబుల్ ఫిగర్‌ను అందుకున్నాడు. మిగిలిన బ్యాటర్వెవరూ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేదు. కేప్టెన్ ఆరోన్ ఫించ్-5, స్టీవ్ స్మిత్-1, అలెక్స్ క్యారీ-4, మార్కస్ స్టొయినిస్-3, కామెరాన్ గ్రీన్-3, అష్టన్ అగర్-0, మిఛెల్ స్టార్క్-2, జోష్ హేజిల్‌వుడ్-0 పరుగులు చేశారు. ఆడమ్ జంపా-1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు.

సమష్టిగా..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 39 ఓవర్లల్లో 142 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఏడు వికెట్లను కోల్పోయింది. కైటానో-19, మరుమని-35, రెజిస్ చకబ్వా-37 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లల్లో హేజిల్‌వుడ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కామెరాన్ గ్రీన్, మిఛెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, అష్టన్ అగర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












