జొహన్నెస్‌బర్గ్: భారత పరుగుల యంత్రం, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీకి తన ఆటో బయోగ్రఫీలో గొప్ప స్థానం ఉందని చెప్పాడు. అంతేగాక, సర్జన్ చేతిలో కత్తి ఎంత పదునుగా ఉంటుందో విరాట్ కోహ్లీ క్రికెట్ బ్యాట్ అంతే పదునుగా ఉంటుందని, మైదానంలో బౌలర్లను ఊచకోత కోస్తాడని చెప్పాడు.
ఎంతో ప్రతిభావంతుడైన కోహ్లీ.. బంతులను గ్యాప్ చూసి బౌండరీలకు తరలిస్తాడని తెలిపాడు. 'ఏబీ: ది ఆటోబయోగ్రఫీ' పేరుతో డివిలియర్స్ ఆటో బయోగ్రఫీ పుస్తకం వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కోహ్లీ గురించి కూడా పలు అంశాలు విశ్లేషించాడు ఏబీ.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్న ఏబీ డివిలియర్స్.. కోహ్లీకి తనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని తెలిపాడు. అతనితో ఆడేందుకు ఇష్టపడతానని తెలిపాడు.
'భారతదేశం నుంచి స్ఫూర్తి(ఇన్‌స్పైర్డ్ బై ఇండియా)' అనే చాప్టర్‌లో భారత్‌కు, భారత ఆటగాళ్లకు సంబంధించిన విశేషాలను పేర్కొన్నట్లు తెలిపాడు. ఐపిఎల్ మూలంగా అంతర్జాతీయ ఆటగాళ్లుగా ప్రత్యర్థులుగా ఉండే తామంతా స్నేహితులుగా మారిపోయామని తెలిపాడు. తన జీవితంలో భారత్ మరిచిపోలేని అనుభూతులను ఇచ్చిందని చెప్పాడు.