
శివమ్ మావి
యూపీ తరఫున దేశవాళీల్లో అద్భుతంగా రాణించిన యువ పేసర్ శివమ్ మావి. 140 కిలోమీటర్లపైగా వేగంతో బౌలింగ్ చేయడమే కాకుండా.. తనకే సాధ్యమైన బౌన్స్ వేరియేషన్స్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం మావి ట్యాలెంట్. అందుకే అతన్ని ఐపీఎల్ మినీ వేలంలో కూడా గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఏకంగా రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు టీమిండియాలో తనకు దక్కిన అవకాశాన్ని మావి ఉపయోగించుకుంటే భవిష్యత్తులో జట్టులో స్థానాన్ని పొందే అవకాశం అతనికి దక్కుతుంది.

భానుక రాజపక్స
టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక తరఫున రాజపక్స పెద్దగా రాణించలేదు. ఇటీవల ముగిసిన లంకన్ ప్రీమియర్ లీగులో కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో శ్రీలంక జట్టులో అతనికి స్థానం దక్కదని అంతా అనుకున్నారు. అయితే సెలెక్టర్లు మాత్రం ఈ బిగ్ హిట్టర్‌పై నమ్మకం ఉంచారు. అందుకే భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అంతకుముందు ఆసియా కప్‌లో రాజపక్స అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు కనుక టీమిండియాపై తను సత్తా చాటితే.. ఆ జట్టులో రాజపక్స స్థానం పదిలం అవుతుంది.

సంజూ శాంసన్
అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించే సత్తా ఉన్నా కాలం కలిసి రాని ఆటగాడు సంజూ శాంసన్. ఈ ఏడాది మొత్తం సూపర్ ఫామ్‌లో ఉన్నా కూడా అతనికి భారత్ తరఫున ఆడే అవకాశాలు చాలా తక్కువగానే వచ్చాయి. అయితే కొత్త సంవత్సరంలో ఈ పరిస్థితి మారుతుందని సంజూ ఆశిస్తున్నాడు. పొట్టి ఫార్మాట్ నుంచి రిషభ్ పంత్‌ను తప్పించడం, ఫినిషర్ రోల్ ఖాళీగా ఉండటంతో సంజూ పంట పండింది. శ్రీలంకపై అతను రాణిస్తే.. ఈ ఫార్మాట్‌లో సంజూకు కచ్చితంగా మరిన్ని అవకాశాలు దొరకడం ఖాయం.

వానిందు హసరంగ
శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ.. ఆ జట్టు తరఫున బెస్ట్ వికెట్ టేకర్. బ్యాటుతో కూడా అతను అడపా దడపా రాణిస్తూనే ఉన్నాడు. ఇటీవల లంక ప్రీమియర్ లీగులో కేవలం 34 బంతుల్లోనే 77 పరుగులతో అదరగొట్టాడు. ఇలాంటి ఇన్నింగ్సులు చూసిన తర్వాత అతనిపై శ్రీలంక టీం మేనేజ్‌మెంట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకే అతన్ని జట్టు వైస్ కెప్టెన్‌ను చేసింది. భారత్‌లో స్పిన్నర్లకు కలిసొచ్చే పిచ్‌లపై హసరంగ రాణిస్తే సిరీస్‌ను ఆ జట్టు గెలిచినా గెలిచేస్తుంది. ఆ జట్టుకు అతను అంత కీలకం మరి.

హార్దిక్ పాండ్యా
ఈ సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే వన్డే సిరీసులో రోహిత్‌కు డిప్యూటీ బాధ్యతలు కూడా పాండ్యాకే దక్కాయి. అంటే రోహిత్ కనుక రిటైర్ అయితే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పాండ్యానే కెప్టెన్ చేయాలని బీసీసీఐ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక సిరీస్‌లో పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. అతను బౌలర్లను ఎలా ఉపయోగించుకుంటాడు? ఎలాంటి ట్యాక్టిక్స్‌తో ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తాడు? వంటి అంశాలన్నింటినీ భూతద్దంలో పరిశీలించడం జరుగుతుంది. ఈ పరీక్షలో ప్యాసయితేనే టీమిండియా పగ్గాలు పాండ్యాకు దక్కుతాయి మరి.


Click it and Unblock the Notifications












