న్యూఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదనల అమలుపై చర్చించేందుకు బీసీసీఐ శనివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్‌జీఎమ్) ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశంలో బోర్డులో సంస్కరణలు అమలు చేస్తామంటూ బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంపై చర్చించనున్నారు.
దీంతో ఈ అఫిడవిట్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఫిడవిట్‌లో ఉండాల్సిన అంశాలు, ఒకే రాష్ట్రం, ఒకే ఓటు, మూడేళ్లలో కూలింగ్ పీరియడ్ వంటి అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. మరోవైపు ఠాకూల్ దాఖలు చేసే అఫిడవిట్‌కు బీసీసీఐ న్యాయబృందం తుది మెరుగులు దిద్దుతుంది.
బీసీసీఐలో కాగ్ ప్రతినిధి నియమిస్తే ప్రభుత్వం జోక్యం పెరిగిపోతుందని గతంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సుప్రీం కోర్టులో చేసిన వాదనలపై మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ కేసుపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

ప్రస్తుతం భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి వాటికి ఓటింగ్ హక్కు లేదు. కాగా, మహారాష్ట్రలోని ముంబై, సౌరాష్ట్ర లాంటి వాటికి ఓట్లు ఉండటం విశేషం. ఇలాంటి అంశాలపై కూడా సుప్రీం కోర్టు దృష్టి సారించింది.
ఐసీసీ ఫైనాన్స్ కమిటీలో ఠాకూర్
ఐసీసీ, బీసీసీఐల మధ్య సయోధ్య కుదిరింది. ఇందులో భాగంగా ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీలో బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్‌కు అధికారికంగా స్థానం కల్పించారు. శుక్రవారం కేప్‌టౌన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల విభాగం ఐసీసీలోనే అత్యంత శక్తివంతమైనది ఫైనాన్స్ కమిటీ. ఈ కమిటీ నిర్ణయాలను స్వయంగా తీసుకుంటుంది. ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల సంఘంలో తమ ప్రతినిధిని తీసుకోకపోవడంపై బీసీసీఐ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా ఎంపికైన ఠాకూర్‌కు నేరుగా ఆర్థిక కమిటీలోనూ స్థానం దక్కుతుందని గవర్నింగ్ బాడీ వర్గాలు వెల్లడించాయి.