
సౌతాంప్టన్: బుధవారం తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా, ఆ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది అని ఇంగ్లండ్ టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. తొలిసారి జట్టుకు నాయకత్వం వహించడం కంటే జట్టును గెలిపించడంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు చెప్పాడు. కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్‌లో ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ రోజు మధ్యాహ్నం సౌతాంప్టన్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లండ్ టెస్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో స్టోక్స్.. ఇంగ్లిష్ జట్టుకు 81వ సారథి కానున్నాడు. తొలి టెస్ట్ సందర్భంగా స్టోక్స్ లండన్ దినపత్రిక మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'బుధవారం నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. నాకు కెప్టెన్సీ కన్నా జట్టు గెలుపే ముఖ్యం. రూట్ గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడం నా కర్తవ్యం. కానీ దృష్టి మొత్తం మ్యాచ్ గెలవాలనే దానిపైనే ఉంది' అని అన్నాడు.
'ఇంగ్లండ్-విండీస్‌ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో గెలుపొందిన జట్టుకు ప్రఖ్యాత విజ్డెన్ ట్రోపీ అందిస్తారు. 2019లో విండీస్ ఆ ట్రోపినీ గెలుచుకుంది. అప్పుడు జట్టులో సభ్యునిగా ఉన్నా.. కానీ ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్నాను. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు కప్‌ను సాధించి పెట్టాలి. మొదటి మ్యాచ్‌లో జట్టు గెలుపుకోసం మా ఆటగాళ్లంతా వంద శాతం నిబద్ధతను ప్రదర్శిస్తారని ఆశిస్తున్నా. నేను కోరుకునేది కూడా ఇదొక్కటే. ప్రస్తుతం నేను ఒక్క మ్యాచ్‌కే కెప్టెన్‌గా ఉన్నా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌లో ఆధిక్యంలో నిలుస్తాం' అని బెన్ స్టోక్స్ చెప్పాడు.
ఈ రోజు మొదలవనున్న తొలి టెస్టుకు సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్ కోసం కరీబియన్ దీవుల నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వెస్టిండీస్ జట్టు 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకొని మ్యాచ్‌కు రెడీ అయింది. ఇక మైదానంలో అభిమానులు లేకున్నా ఆటగాళ్లకు ఆ లోటు కనిపించకూడదని.. కేరింతలతో కూడిన శబ్దాలు, మ్యూజిక్‌ను ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మామూలుగా అయితే ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదేమో. కానీ కరోనాతో వచ్చిన విరామం తర్వాత ఈ మ్యాచ్‌లపై ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. ఇక బయో సెక్యూర్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ సఫలీకృతమైతే.. సిరీస్‌లు నిర్వహించాలని మిగిలిన దేశాల బోర్డులు కూడా చూస్తున్నాయి.