
హైదరాబాద్: క్రీడాకారుల మధ్య పోటీ ఉంటుంది కానీ, శత్రుత్వం కాదని మరోసారి నిరూపించాడు పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది. శుక్రవారం నిన్నటి తరం క్రికెటర్లంతా రెండు జట్లుగా విడిపోయి స్విట్జర్లాండ్‌లో మంచు పర్వతం మీద క్రికెట్ మైదానాన్ని తీర్చిదిద్ది శుక్రవారం రెండు మ్యాచ్‌లు ఆడారు.
షాహిద్ ఆఫ్రిది నేతృత్వంలో రాయల్స్, వీరేంద్ర సెహ్వగ్ సారథ్యంలో డైమండ్స్ మధ్య పోరు క్రికెట్ అభిమానులను అలరించింది. అయితే ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం ఆఫ్రిదితో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. భారత్ నుంచి మ్యాచ్‌కు హాజరైన అభిమానులు కూడా ఆఫ్రిదితో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు.
అయితే వారి చేతిలో భారత్ జాతీయ జెండా ఉంది. జెండాతో ఫోటో విషయంలో సందేహించిన అభిమానులు దానిని పక్కకు పెట్టారు. అయితే ఆఫ్రిదినే స్వయంగా చొరవ తీసుకొని మరీ భారత్ జాతీయ పతాకాన్ని ఎదురుగా ఉంచి మరీ ఫోటో దిగాడు. దీంతో భారత్ అభిమానులు ఆఫ్రిదితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
ఆఫ్రిది నేతృత్వంలోని రాయల్స్ మొదటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో సెహ్వగ్ సారథ్యంలోని డైమండ్స్‌పై గెలిచిన సంగతి తెలిసిందే. నిర్ణీత 20ఓవర్లలో సెహ్వగ్ జట్టు 164/9 పరుగులు సాధించగా, ఆఫ్రిది జట్టు చెలరేగి ఆడి మరీ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరకుంది. ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ ఒవైస్ షా 74 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లోనూ రాయల్స్ జట్టు సెహ్వగ్ జట్టుపై 8వికెట్ల తేడాతో గెలిచింది.
క్రికెట్ గురించి అక్కడ కూడా తెలియాలనే:
మంచు పర్వతాలలో ప్రత్యేకంగా క్రికెట్ మైదానాన్ని తయారు చేసి మరీ నిన్నటి తరం ఆటగాళ్లు క్రికెట్ ఆడటం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. స్విట్జార్లాండ్ భూభాగాలకు కూడా ఈ ఆటను పరిచయం చేయాలని ఇలా ప్రయత్నించారట. ఈ మ్యాచ్‌లను ఫైలెట్ ప్రాజెక్టులుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సి్‌ల్ ఆమోదించిందట. 1988లో తొలిసారిగా మంచుపై క్రికెట్ ఆడారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.