
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోమవారం తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అనుష్క సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కోహ్లీనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నట్లు కోహ్లీ తెలిపాడు. తల్లీకూతుళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారని, అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని కూడా చెప్పాడు. అయితే పాప ఫొటోను మాత్రం విరాట్ పోస్ట్ చేయలేదు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కుమార్తె తొలి ఫొటో చూడాలని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ గతరాత్రి చిన్నారి పాప ఫొటోను ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తెల్లటి బ్లాంకెట్‌లో పాపాయిని చుట్టి ఉండగా.. కాళ్లు కనపడేలా ఆ ఫొటో ఉంది. ఆ ఫొటోకు 'స్వాగతం' అని వికాస్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పుడు తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, తమ ఇంట్లోకి లిటిల్ ఏంజిల్ వచ్చిందని అతడు పేర్కొన్నాడు.
ఫోటోలో చిన్న పాప ఉండటంతో తను విరాట్ కోహ్లీ కూతురేనని అందరూ అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున లైకులు, షేర్లు కొట్టారు. అయితే ఈ ఫోటో కోహ్లీ కూతురుది కాదట. ఏదో విషెస్ చెప్పడానికి కోహ్లీ సోదరడు వికాస్ కోహ్లీ ఈ ఫోటోను ఉపయోగించుకున్నాడట. ఈ విషయాన్నే స్వయంగా విరాట్ సోదరుడు వికాస్ తెలిపాడు. ర్యాండమ్‌గా (ప్రతీకాత్మక చిత్రాన్ని) ఈ ఫోటోను వాడానని.. అది విరాట్ కోహ్లీ కూతురుది కాదని వికాస్ తెలిపాడు. దీంతో ఫాన్స్ నిరాశకు లోనయ్యారు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చాడు. తమకు తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క శర్మ పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. ప్రస్తుతం ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. ఇక విరాట్ కూతురు పేరుపై అప్పుడే సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. కోహ్లీ, అనుష్క జంటను అంతా 'విరుష్క' అని పిలుస్తుంటారు. కాబట్టి ఈ పేరే పెట్టే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పాపకు 'అన్వీ' అనే పేరు పెడతారని కూడా టాక్ వినిపిస్తోంది. Anushka పేరులోని మొదటి రెండు అక్షరాలు AN.. VIRAT పేరులోని మొదటి రెండు అక్షరాలు VI కలిపితే ANVI అవుతుంది.