లండన్: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లయిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ స్పందించారు. భారత క్రికెట్ వ్యవహారాలకు సంబంధించి తొలిసారి నిజాయితీ గల నిర్ణయం వెలువడిందని మోడీ వ్యాఖ్యానించారు.
'జస్టిస్ లోధా కమిటీ నివేదిక కేవలం తొలి అడుగు మాత్రమే. ఇది ఇక్కడితో ముగిసిపోయే అంశం కాదు, ఇప్పుడే ఆరంభమైంది. చెన్నై, రాజస్థాన్ జట్లకు రెండేళ్ల నిషేధం అనేది తేలికైన శిక్ష, అసలు వీటిపై పూర్తిగా నిషేధం విధించాల్సింది' అని లలిత్ మోడీ అభిప్రాయపడ్డారు. 'అయితే ఇప్పటి వరకు భారత క్రికెట్‌లో నిజాయితీ గల నిర్ణయమిదని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు' అని మోడీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్‌లో కోర్టులు జోక్యం చేసుకోవడంతోనే బిసిసిఐ వైఫల్యం కనబడుతోందన్నాడు. మంగళవారం చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాపై జీవితకాల నిషేధం విధించింది. వీరిద్దరూ క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం పెట్టింది. మేయప్పన్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలతో బిసిసిఐ, ఐపిఎల్‌తో పాటు క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చిందని లోధా కమిటీ పేర్కొంది.