
హైదరాబాద్: మీకు ఈ విషయం తెలుసా? ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో మొట్టమొదటిసారి హ్యాట్రిక్ వికెట్లు తీసింది ఓ భారత బౌలర్. సరిగ్గా 31 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా బౌలర్ చేతన్ శర్మ ఈ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 31, 1987లో నాగ్ పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో చేతన్ శర్మ కివీస్ బ్యాట్స్‌మెన్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్‌గా చేతన్ శర్మ చరిత్ర సృష్టించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్ తరుపున చేతన్ శర్మ 23 టెస్టులు, 65 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఇక, ఐసీసీ వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్ రికార్డు శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఉంది.