న్యూఢిల్లీ: కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఓ కేసులో టీమిండియా వన్డే కెప్టెన్ ధోని భార్య సాక్షిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సాక్షితో పాటు మరో ముగ్గిరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్‌గ్రామ్‌కు చెందిన డెన్నీస్ అరోరా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే... సాక్షి ధోనీ, అరుణ్ పాండే, సుభావతి పాండే, ప్రతిమ పాండేలు 'రితి ఎమ్మెస్‌డి అల్మోడ్ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీకి కో డైరెక్టర్లు. ఈ కంపెనీకు స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్, ఒక జిమ్ కమ్ ఫిట్‌నెస్ సెంటర్‌లో షేర్లు ఉన్నాయి. అయితే స్పోర్ట్స్ ఫిట్‌లో డెన్నీస్ అరోరా కూడా ఒక కో డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇందులో డెన్నీస్ తండ్రి వికాస్ అరోరాకు 39 శాతం షేర్లు ఉన్నాయి. అయితే వికాస్ అరోరాకు చెందిన షేర్లను కొనుగోలు చేయాలని 'రితి ఎమ్మెస్‌డి ప్రైవేట్ లిమిటెడ్' నిర్ణయించుకుంది. ఈ డీల్‌లో భాగంగా అతడికి రూ. 11 కోట్లు చెల్లాంచాల్సి ఉంది. అయితే రూ 2.25 కోట్లు మాత్రమే చెల్లించారని డెన్నీస్ అరోరా ఆరోపిస్తున్నారు.
మార్చి 31 డెడ్ లైన్‌గా పెట్టుకున్నప్పటికీ తనకు డబ్బు చెల్లించలేదని పోలీసులను ఆశ్రయించాడు. అయితే వికాస్ అరోరా తమకు బదిలీ చేసిన షేర్ల కంటే ఎక్కువగానే తాము చెల్లించామని కో డైరెక్టర్లలో ఒకరైన అరుణ్ పాండే అంటున్నారు. ఏడాది క్రితమే సాక్షి కంపెనీను వదిలి వెళ్లిపోయారని, ఆమెపై కేసు పెట్టడం కుదరని తేల్చి చెప్పారు.