T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు కివీస్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ భారత ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. బుమ్రా క్రేజ్ లేదా అతని పేరు చూసి తాను భయపడనని, తన ప్లాన్ చాలా సింపుల్ అని ఫిన్ అలెన్ స్పష్టం చేశాడు.
బంతిని చూస్తా.. బౌలర్‌ను కాదు!
సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై కేవలం 33 బంతుల్లోనే శతకం బాది, వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన ఫిన్ అలెన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఫిన్ అలెన్.. బుమ్రాను ఎదుర్కోవడంపై తన వ్యూహాన్ని బయటపెట్టాడు. "నా మంత్రం చాలా స్పష్టం. బంతిని చూసి ఆడతాను తప్ప, బౌలర్ పేరును చూసి కాదు. అవతల జస్ప్రీత్ బుమ్రా పరిగెత్తుకుంటూ వస్తున్నాడని ఆలోచిస్తే.. ఆట కంటే ఒత్తిడికే ఎక్కువ లోనవుతాం. అందుకే నేను బౌలర్ ప్రతిష్ట గురించి ఆలోచించకుండా కేవలం బాల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను" అని అలెన్ అన్నాడు.

వీడియో అనాలసిస్ అవసరం లేదు..
ప్రస్తుత కాలంలో బ్యాటర్లు జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోవడానికి గంటల తరబడి వీడియోలు చూస్తూ ప్లాన్ చేస్తుంటారు. కానీ ఫిన్ అలెన్ మాత్రం భిన్నమైన శైలిని అనుసరిస్తున్నాడు. తాను బుమ్రాకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక వీడియో అనాలసిస్ చేయలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. "మేము కేవలం కాఫీ తాగుతూ కోచ్ ల్యూక్ రోంచీతో సరదాగా చర్చిస్తాం. బుమ్రా ఎలా వేస్తాడో టీవీల్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం కదా, దానికి ప్రత్యేకంగా ఫుటేజ్ చూడాల్సిన అవసరం ఏముంది?" అని ఫిన్ అలెన్ ప్రశ్నించాడు.
ఫిన్ అలెన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా
నేటి ఫైనల్ విజేతను ఈ ఇద్దరి మధ్య పోరు నిర్ణయించే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఈ వరల్డ్ కప్‌లో 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. కేవలం 6.6 ఎకానమీతో పరుగులు కట్టడి చేస్తున్నాడు. డెత్ ఓవర్లలో బుమ్రా వేసే యార్కర్లు ఎంతటి బ్యాటర్‌నైనా బోల్తా కొట్టించగలవు.మరోవైపు ఫిన్ అలెన్ 7 ఇన్నింగ్స్‌ల్లో 289 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 204గా ఉండటం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటివరకు 20 సిక్సర్లు బాదాడు.
పవర్‌ప్లేలో అసలైన మజా
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రాను పవర్‌ప్లేలోనే రంగంలోకి దించే అవకాశం ఉంది. మూడో లేదా నాలుగో ఓవర్లో బుమ్రా బంతిని అందుకుంటే, అలెన్‌తో అతని ఫైట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. తొలి బంతి నుంచే విరుచుకుపడే అలెన్.. బుమ్రా వేసే టో-క్రషింగ్ యార్కర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఫిన్ అలెన్ ధీమా చూస్తుంటే బుమ్రాను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. మరి అహ్మదాబాద్ స్టేడియంలో బుమ్రా మాయాజాలం పనిచేస్తుందా? లేక అలెన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ను దెబ్బతీస్తాడా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.