
క్రైస్ట్‌చర్చ్: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ ముక్కోణపు సిరీస్ ఆడుతోన్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా మ్యాచ్‌లు సాగుతున్నాయి. ఫైనల్‌తో కలుపుకొని మొత్తం ఏడు మ్యాచ్‌లల్లో ప్రత్యర్థులు తలపడుతున్నారు. ఇందులో నాలుగు పూర్తయ్యాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్ రెండు చొప్పున విజయాలను సాధించాయి. బంగ్లాదేశ్ ఇంకా ఖాతా కూడా తెరవలేదు.
నాలుగో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది కేన్ విలియమ్సన్ టీమ్. తొలుత ఫీల్డింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ విజృంభించారు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. కివీస్ బౌలర్ల ధాటికి ఏడు వికెట్లను కోల్పోయి 130 పరుగులే చేయగలిగింది పాక్. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్-16, కేప్టెన్ బాబర్ ఆజమ్-21, షాన్ మసూద్-14, షాదాబ్ ఖాన్-8, ఇఫ్తికర్ అహ్మద్-27, హైదర్ అలీ-8, మహ్మద్ నవాజ్-0 పరుగులు చేశారు. ఆసిఫ్ అలీ-25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
టీమ్ సౌథీ, మిఛెల్ శాంట్నర్, మిఖాయిల్ బ్రేస్‌వెల్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఈష్ సోధి ఒక్క వికెట్ తీసుకున్నాడు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు మహ్మద్ రిజ్వాన్ అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి వరుసగా వికెట్లు పడుతూనే వచ్చాయి. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో పగడ్బందీగా బంతులను సంధిస్తోన్న కివీస్ బౌలర్లను తట్టుకుని క్రీజ్‌లో నిలవలేకపోయారు.
131 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్ పెద్దగా శ్రమించలేదు. ఆడుతూ పాడుతూ కొట్టి పడేసింది. పాకిస్తాన్ బ్యాటర్లు విఫలమైన అదే పిచ్ మీద ధారాళంగా పరుగులు రాబట్టుకున్నారు. 16.1 ఓవర్లల్లోనే మ్యాచ్‌ను ముగించేశారు. ఓపెనర్ ఫిన్ అల్లెన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 42 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 62 పరుగులు బాదాడు. తోటి ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి 117 పరుగులను జోడించాడు.
షాదాబ్ ఖాన్ బౌలింగ్ క్రీజ్‌ను వదిలి ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయిన అల్లెన్ టైమింగ్ మిస్ అయ్యాడు. కీపర్ మహ్మద్ రిజ్వాన్ స్టంపౌట్‌తో పెవిలియన్ దారి పట్టించాడు. మరో వికెట్ కోల్పోలేదు కివీస్. మ్యాచ్ ముగిసే సరికి డెవాన్ కాన్వే-49, కేప్టెన్ కేన్ విలియమ్సన్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నాలుగు ఓవర్లల్లో 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన బ్రేస్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.