పోగొట్టుకున్న తన బ్యాగీ గ్రీన్ క్యాప్ తిరిగి దొరికిందని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా తాను మోస్తున్న భారం దిగిపోయిందని అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. ఇటీవల వార్నర్ తన బ్యాగ్‌ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. అందులో తన పిల్లల వస్తువులతో పాటు బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉందని వార్నర్ చెప్పాడు.
పాకిస్థాన్‌తో ఆఖరి టెస్టు కోసం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వస్తున్న దారిలో బ్యాగ్ మిస్ అయి ఉంటుందని వార్నర్ భావించాడు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించినా బ్యాగ్ ఆచూకి దొరకలేదని వార్నర్ వివరించాడు. బ్యాగీ గ్రీన్ తనకి ఎంతో సెంటిమెంట్ అని , తిరిగి ఇచ్చేయమని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభ్యర్థించాడు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ కూడా స్పందించాడు. ''బ్యాగీ గ్రీన్ క్యాప్ మిస్ అయిందా? ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు. డేవిడ్ వార్నర్ 100కు పైగా టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున పోరాడాడు. చివరి టెస్టు ఆడుతున్న వార్నర్ తన బ్యాగీ గ్రీన్ ధరించడమే గౌరవం. అందరూ అతడి కోసం సాయం చేయడానికి ప్రయత్నించండి'' అని ఆసీస్ ప్రధాని పోస్ట్ చేశాడు.
అనంతరం వార్నర్ బ్యాగీ గ్రీన్ కోసం విస్తృతంగా గాలించారు. రెండు రోజుల తర్వాత సిడ్నీలోని ఆస్ట్రేలియా జట్టులో ఉంటున్న హోటల్‌లో క్యాప్ దొరికింది. ''నా బ్యాగీ గ్రీన్‌ను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్రికెటర్‌కు ఇది ఎంతో కీలకం. దీన్ని నా జీవితాంతం ఆదరిస్తాను. బ్యాగీ గ్రీన్‌ను వెతకడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. రెండు రోజులగా మోస్తున్న భారం దిగిపోయింది" అని వార్నర్ అన్నాడు.
టెస్టు అరంగేట్రంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను పొందుతారు. దాన్ని వారు ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి బ్యాగీ గ్రీన్‌ను తన చివరి టెస్టు ముందు కనిపించకపోవడంతో వార్నర్ తట్టుకోలేకపోతున్నాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు వార్నర్‌కు ఆఖరిది. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సాల్మన్ బౌలింగ్‌లో వార్నర్ 34 పరుగుల వద్ద ఔటయ్యాడు.