చెన్నై : అంతర్జాతీయ క్రికెట్ లో టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ ఆవేశానికి లోనవడం ఎప్పుడూ చూసింది లేదు. అయితే కొత్తగా ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్ మాత్రం అశ్విన్ తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. ప్రత్యర్థి బౌలర్ పరుష వ్యాఖ్యలకు కోపోద్రిక్తుడైన అశ్విన్ సదరు బౌలర్ ను మైదానంలోనే గట్టిగా హెచ్చరించాడు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా.. దిండిగల్ డ్రాగన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ సందర్బంగా ఈ వివాదం చోటు చేసుకుంది. వివాదం రేగిన సమయంలో అశ్విన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. జగదీష్ అనే మరో బ్యాట్స్ మెన్ క్రీజులో ఉన్నాడు. ఇదే క్రమంలో.. ప్రత్యర్థి జట్టు బౌలరైన సాయి కిషోర్ బౌలింగ్ లో జగదీష్ క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఇక్కడే అసలు వివాదం మొదలైంది. జగదీష్ అవుట్ అవగానే.. తన నోటికి పనిచెప్పిన సాయి కిషోర్ ఏవో కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. మీద మీదకొచ్చి జగదీష్ ను రెండు చేతులతో తోసేశాడు. కిషోర్ ప్రవర్తనతో అశ్విన్ కోపం కట్టలు తెంచుకుంది. అంతే.. బ్యాట్ తో అతన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలో అంపైర్లు వచ్చి ఇరువురికి నచ్చజెప్పి ఆటను కొనసాగించారు.