హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. బ్లాక్ టికెట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు క్రికెట్ అభిమానులపై దాడికి దిగారు.
దీంతో సహనం కోల్పోయిన యువకులు పోలీసులపైకి తిరగబడ్డారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారని మఫ్టీలోని పోలీసులు కొందరు యువకులపై దాడి చేశారు. ఐతే వారు పోలీసులని తెలియక బాధితలు వారిని చితకబాదారు.
దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు యువకులపై లాఠీచార్జీ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో వన్డే మ్యాచ్ నిర్వహించడంతో ఉప్పల్ స్టేడియానికి పెద్దఎత్తున అభిమానులు పోటెత్తారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.

హైదరాబాద్‌కు చెందిన అంబటి రాయుడు తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీయడంతో క్రికెట్ అభిమానులు ఉత్సహాంగా కేరింతలు కొట్టారు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న విరాట్ కోహ్లీ సేన మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ ఎగరేసుకుపోవాలని కృత నిశ్చయంతో ఉంది.
ఈ వన్డే మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. హైదరాబాద్ నగరానికి ఉగ్రవాదుల ముప్పు ఉన్నట్లు నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో గతంలో కన్నా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇప్పటికే స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు 1500 మంది సిబ్బందితో భద్రత, 56 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. స్టేడియం లోపలికి మొబైల్ ఫోన్లు, నీళ్ల బాటిళ్లను అనుమతించబోమని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.