
లండన్: భారత ఆటగాళ్ల ఫీల్డింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి టీమిండియా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లకు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టంప్స్ వెనుక రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అతని ఏకాగ్రతను పరీక్షించడానికి శ్రీధర్ తనకు రెండు వైపులా ఇద్దరు ప్లేయర్స్‌ను ఉంచాడు.
మరోవైపు బౌలర్ బౌలింగ్ చేస్తుండగా.. ఈ ఇద్దరు ప్లేయర్స్ అటు నుంచి ఇటు బాల్ విసురుతూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారు. మధ్యలో ఈ బాల్ వల్ల పంత్ తన ఏకాగ్రత కోల్పోకుండా బౌలర్ విసిరిన బంతిని పట్టుకోవాలి. బౌలర్ విరిసిన బంతులను ఫీల్డింగ్ కోచ్ వదిలేయగా.. కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా పట్టుకున్నాడు. దీంతో అతడిని ప్రత్యేకంగా అభినందించాడు. 'ఈ వినూత్న ఫీల్డింగ్ డ్రిల్ ఎలా ఉంది' అంటూ బీసీసీఐ ట్విటర్‌లో ఆ వీడియో పోస్ట్ చేసింది. నెట్టింట వైరల్ అయింది. 'సూపర్ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్', 'వినూత్న ప్రయత్నం' అంటూ టీమిండియా ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో త్వరలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీమిండియా కోచ్ పదవికి గుడ్‌బై చెప్పేస్తానని రవిశాస్త్రి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత అతడు వీడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే అతడికి 59 ఏళ్లు నిండాయి. కోచ్ పదవికి వయో పరిమితి 60 ఏళ్లే. పైగా సుదీర్ఘ కాలంగా ఆ పదవిలో ఉన్నాడు. దీంతో అటు రవిశాస్త్రి, ఇటు బీసీసీఐ ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ సైతం జట్టును వీడనున్నారు.
ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా ఇప్పటికే లండన్ చేరుకుంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే రెండో టెస్టుకు ముందు భారత్, ఇంగ్లండ్ జట్లకు వరుస షాకులు తగిలాయి. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ స్టువర్ట్ బ్రాడ్, టీమిండియా యువ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడ్డారు. వీరిద్దరూ లార్డ్స్ టెస్టు ఆడటం కష్టమేనని సమాచారం తెలుస్తోంది. బ్రాడ్ బదులు మార్క్ వుడ్, శార్దూల్ స్థానాన్ని ఇషాంత్ శర్మ భర్తీ చేస్తారని సమాచారం.
మంగళవారం సాధన చేస్తుండగా స్టువర్ట్ బ్రాడ్ కాలి మడమ మలుచుకుందని అంటున్నారు. గాయం తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. అతడు లేచి నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడిని వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. శార్దూల్ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని తెలిసింది. మంగళవారం సాధన చేసేటప్పుడు కండరాలు పట్టేశాయని సమాచారం. అతడి గాయం తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారమైతే లేదు.