
అబుదాబి: ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్ (53; 30 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి (74; 42 బంతుల్లో 8x4, 3x6) దంచికొట్టాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా వెంకటేశ్ అయ్యర్ ఎంపికయ్యాడు. అయితే ముంబై ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'కొన్ని ఏరియాల్లో తప్పులు చేశాం. మేము ఇన్నింగ్స్‌ను చాలా బాగా ఆరంబించాం. కానీ ఇన్నింగ్స్ చివరలో ఆశించినంత స్కోర్ రాలేదు. ఇది మంచి పిచ్ అని నేను భావిస్తున్నా. మేము ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాము. ఇక మా బౌలర్లు కూడా ప్రారంభంలో బాగా బౌలింగ్ చేయలేదు. అయితే దీని గురించి మేము ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటలో గెలుపోటములు సహజమే. ఏదేమైనా ముందుకు సాగాలి' అని అన్నాడు.
'మంచి ఆరంభం తర్వాత మేము చిన్న చిన్న భాగస్వామ్యాలను మాత్రమే నెలకొల్పాల్సి వచ్చింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడమే అందుకు కారణం, కొత్త బ్యాటర్లు క్రీజులోకి వెళ్లి బంతిని కొట్టడం అంత సులభం కాదు. గత గేమ్‌లో కూడా ఇలానే జరిగింది. వీటిపై మేము చర్చిస్తాం. మేము ఇంకా టేబుల్ (పాయింట్ల పట్టిక) మధ్యలోనే ఉన్నాము. కాబట్టి మేము తిరిగి పుంజుకోవాలి. కొన్ని విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది' అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ చెప్పాడు. ఈ మ్యాచులో రోహిత్ 30 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అందులో నాలుగు బౌండరీలు ఉన్నాయి.
ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఓ ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో ఓ ప్రత్యర్థి జట్టుపై 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరుణ్ చక్రవర్తి వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడంతో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ మ్యాచుకు ముందు కోల్‌కతాపై హిట్‌మ్యాన్ 982 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. పంజాబ్ కింగ్స్‌పై 943 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. వార్నర్ కోల్‌కతాపై కూడా 915 రన్స్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 909 (ఢిల్లీ క్యాపిటల్స్) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.