
దుబాయ్: చప్పట్లు కొడుతూ.. ఈలలు వేస్తూ.. కేరింతలు కొడుతూ ఎంకరేజ్ ప్రేక్షకులు లేక.. బోసిపోయినట్టుగా కనిపిస్తోన్న స్టేడియంలో సొట్ట బుగ్టల సుందరి తళుక్కున మెరిసింది. ఐపీఎల్ మ్యాచ్‌కు కాస్తో, కూస్తో గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. ఆమే- ప్రీతిజింతా. గురువారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆమె కనువిందు చేస్తూ కనిపించారు. తన సొంత జట్టు విజయాన్ని ఆస్వాదించారు.
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. వారి రాకపై నిషేధాన్ని విధించారు. టీమ్ మేనేజ్‌మెంట్లకు ఈ మినహాయింపు ఉంది. ఫ్రాంఛైజీలు మొదలుకుని టీమ్ మేనేజ్‌మెంట్ తరఫున ఎవ్వరూ స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. క్వారంటైన్ కాలాన్ని గడపాల్సి ఉంటుంది. అది కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే.
ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి టోర్నమెంట్ ఆరంభానికి ముందే ఎమిరేట్స్‌లో ల్యాండ్ అయ్యారు. అయిదురోజుల పాటు క్వారంటైన్‌లో గడిపారు. మూడు దఫాలుగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించుకున్నారు. ఆమెకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. దీనితో ప్రీతిజింతాకు స్టేడియంలోకి ఎంట్రీ లభించింది. గురువారం రాత్రి నాటి మ్యాచ్‌లో ఎప్పట్లాగే కేరింతలు కొడుతూ కనిపించారామె. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
ట్విస్ట్ ఏమిటంటే- ఎక్కడైతే కూర్చోకూడదంటూ దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం మేనేజ్‌మెంట్ అదే పనిగా రాసి పెట్టిందో.. అక్కడే వెళ్లి కూర్చాన్నారమె. ఆమె కూర్చున్న సీటింగ్ రోలో ప్లీజ్ డోన్ట్ సిట్ హియర్ అనే పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడే వెళ్లి కూర్చుని మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. ఆమెను అక్కడి నుంచి వెనక్కి పంపించే ప్రయత్నమూ ఎవరూ చేయలేదు. దీనికి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియోను ప్రీతిజింతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టేడియం ఇలా బోసి కనిపించడం స్ట్రేంజ్‌గా అనిపిస్తోందని కామెంట్స్ చేశారు.