
హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో తిరిగి చోటు దక్కించుకున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సత్తా చాటుతున్నాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 65, రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేశాడు.
ఇక, సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 20, రెండో ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేశాడు. ఇలా నాలుగు ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ 50 యావరేజితో 200 పరుగులు నమోదు చేశాడు. సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ ఆటే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న స్థితిలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ దూకుడుగా ఆడి 80 పరుగులు చేశాడు. మూడో వికెట్‌కు ఓపెనర్ డీన్ ఎల్గర్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 258 పరుగులు చేయగలిగింది.
అదే రెండో ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్-డివిలియర్స్ జోడిని త్వరగా విడదీసి ఉంటే రెండో టెస్టు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కాగా, రెండేళ్ల తర్వాత టెస్టుల్లో అడుగుపెట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుండటంపై డివిలియర్స్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు చెప్పాడు.
'నేను బాగా ఆడుతున్నా. మ్యాచ్‌కు తగిన రీతిలో సన్నద్ధం అవుతున్నా. బంతిని సరిగా అంచనా వేస్తున్నా. ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నానని భావిస్తున్నా. గతంలోనూ ఇదే తరహా ఆటతీరు కనబర్చాను. వరుసగా ఐదు సెంచరీలు బాదలేకపోవచ్చు. వరుసగా ఐదు డకౌట్లు కావచ్చు. కానీ నా ఆటతీరుతో సంతోషంగా ఉన్నా' అని డివిలియర్స్ సంతోషం వ్యక్తం చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.