ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడా? ముంబై తరఫున హిట్ మ్యాన్ తన చివరి మ్యాచ్ ఆడేశాడా? అనే ప్రశ్నలకు నిన్న పరోక్షంగా సమాధానం లభించినట్లుగా తెలుస్తోంది. వాంఖడే వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పోరులో గెలిచి ఐపీఎల్-2024ను విజయంతో ముగించాలనుకున్న హార్దిక్ సేనకు నిరాశే ఎదురైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో, 5x4, 8x6), కేఎల్ రాహుల్ (55; 41 బంతుల్లో, 3x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. ఆయుష్ బదోని (22*, 10 బంతుల్లో, 1x4, 2x6) దూకుడుగా ఆడాడు. నువాన్ తుషారా (3/28), పీయూష్ చావ్లా (3/29) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో, 10x4, 3x6) టాప్ స్కోరర్. నమన్ ధిర్ (62*; 28 బంతుల్లో, 4x4, 5x6) పోరాడాడు. రవి బిష్ణోయ్ (2/37), నవీనుల్ (2/50) తలో రెండు వికెట్లు తీశారు. రోహిత్ క్రీజులో ఉన్నంత వరకు ముంబై ఫేవరేట్‌గా నిలిచింది. కానీ హిట్ మ్యాన్ ఔటైన అనంతరం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆఖర్లో నమన్ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది.
అయితే రోహిత్ శర్మ ఔటై పెవిలియన్‌కు చేరుతున్న వేళ స్టేడియంలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. 'ముంబై కా రాజా రోహిత్ శర్మ' అంటూ నినాదాలు చేశారు. ఇదంతా రోహిత్ చూపించిన పోరాట పటిమకు ప్రేక్షకులు అభినందించినట్లుగా లేదు. ముంబై ఇండియన్స్ తరఫున హిట్ మ్యాన్‌కు ఇదే చివరి మ్యాచ్‌గా, ఫేర్‌వెల్ ఇస్తున్నట్లుగా స్టేడియంలో వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబై బంధానికి రోహిత్ ముగింపు పలికాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.