గబ్బా వేదికగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ పింక్ బాల్ టెస్టులో తలపడుతున్నాయి. ఈ చివరి టెస్టులో పర్యాటక జట్టు వెస్టిండీస్ సంచలన ప్రదర్శన చేస్తోంది. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన విండీస్ అద్భుత పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. సమర్థమైన ఆసీస్ బౌలర్లను కంగారూల గడ్డపై ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కఠిన సవాలే. కానీ వెస్టిండీస్ అదరగొట్టింది.
జాషువా డిసిల్వా (79), కవెమ్ హోడ్జ్ (71), కెవిన్ సిన్‌క్లెయిర్ (50), అల్జారీ జోసెఫ్ (32) గొప్పగా పోరాడుతూ జట్టుకు భారీ స్కోరు సాధించారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా విండీస్ బౌలర్ల ధాటికి 54 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. రోచ్, అల్జారీ జోసెఫ్ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను భయపెట్టారు.

కాగా, ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (65)తో కలిసి ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (47*) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 బంతుల్లో 96 పరుగులు జోడించారు. తర్వాత వెస్టిండీస్ బౌలర్లు పుంజుకోవడంతో ఆస్ట్రేలియా టీ విరామానికి 161/7 స్కోరుతో నిలిచింది. అయితే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో చోటు చేసుకున్న ఓ ఘటనతో ఆస్ట్రేలియా జట్టు విమర్శలు ఎదుర్కోంటుంది.
అసలేం జరిగిందంటే.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోచ్ సింగిల్‌కు ప్రయత్నించాడు. కానీ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న కెవిన్ సిన్‌క్లెయిన్ వద్దని చెప్పాడు. ఈ క్రమంలో రోచ్ స్లిప్ అయ్యి పిచ్ మీద కిందపడ్డాడు. దీంతో నిస్సహాయస్థితిలో చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు ఆసీస్ ఫీలర్లు రనౌట్ చేశారు. అయితే బ్యాటర్లు కిందపడినప్పుడు క్రీడాస్ఫూర్తితో ఫీల్డింగ్ జట్టు చాలా సందర్భాల్లో రనౌట్ చేయకుండా విడిచిపెట్టింది. కానీ వెస్టిండీస్‌కు ఆస్ట్రేలియా ఆ అవకాశం ఇవ్వలేదు.
వెస్టిండీస్ టెయిలెండర్స్ ప్రమాదకరమని భావించి రోచ్ రనౌట్‌ను ఆస్ట్రేలియా వెనక్కి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. ఓటమి భయంతోనే, క్రీడాస్ఫూర్తిని మరిచి రనౌట్‌ను వెనక్కి తీసుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే రోచ్ బ్యాటింగ్ పార్టనర్ కెవిన్ సింగిల్ తిరస్కరించాడని, అతడు కిందపడకపోయినా రనౌటయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని మరికొందరు నెటిజన్లు ఆసీస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.