డెడ్ బాల్ వివాదం..
ఈ మ్యాచ్‌లో కొత్తగా డెడ్ బాల్ కాంట్రవర్సీ తెర మీదికి వచ్చింది. భారత్‌కు ఘన విజయాన్ని అందించిన చివరి ఓవర్‌లో చోటు చేసుకున్న హైడ్రామా దీనికి కారణమైంది. గెలవడానికి భారత్‌కు చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన దశలో బైస్ రూపంలో మూడు ఎక్స్‌ట్రా పరుగులు రావడం, ఫ్రీ హిట్ దక్కడం వంటి పరిణామాలు విజయానికి మరింత చేరువ చేశాయి.
అంతకుముందే దొంగదెబ్బ..
అంతకుముందే పాకిస్తాన్.. టీమిండియాను దొంగదెబ్బ తీసింది. రోహిత్ సేనను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. దీనికి అంపైర్ల నుంచి కూడా పూర్తి సహకారం లభించడంతో మరింత దూకుడుగా వ్యవహరించింది. ఓటమి కోరల నుంచి బయటపడటానికి పాకిస్తాన్ చేయాల్సిందంతా చేసింది. భారత్ గెలుపు వాకిట నిలిచిన సమయంలో.. చివరి ఓవర్‌లో పాకిస్తాన్ డెడ్ బాల్ వివాదాన్ని తెర మీదికి తీసుకొచ్చింది గానీ- విరాట్ కోహ్లీ విశ్వరూపం ముందు అవన్నీ వెలవెలబోయాయి.
అక్షర్ పటేల్ రనౌట్..
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రనౌట్ ఇప్పుడు సరికొత్తగా దుమారాన్ని రేపుతోంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ రనౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్ ఏడో ఓవర్ తొలి బంతికి అతను అవుట్ అయ్యాడు. షాదబ్ ఖాన్ సంధించిన ఓవర్ అది. మిడ్ వికెట్‌పై సంధించిన బంతిని ఆడిన అక్షర్.. రన్ తీయబోయాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరుగెత్తాడు. అప్పటికే బంతి ఫీల్డర్ బాబర్ ఆజమ్ చేతికి చేరిన విషయాన్ని గుర్తించిన విరాట్ కోహ్లీ.. అతణ్ని వెనక్కి పంపించాడు. అక్షర్ పటేల్ క్రీజ్‌కు చేరుకునే లోపే- బాబర్ బంతిని వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు అందించడం, అతను వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి.
బాల్ కాదు గ్లోవ్స్..
వికెట్లను గిరాటేసే సమయానికి అక్షర్ పటేల్ ఇంకా క్రీజ్‌కు చేరుకోలేదు. అదే సమయంలో బాబర్ ఆజమ్ విసిరిన బంతిని రిజ్వాన్ సరిగ్గా అందుకోలేకపోయాడు. అతను వికెట్లను కూల్చే సమయంలో బంతి అతని చేతుల్లో లేదు. ఉత్తి గ్లోవ్స్‌తోనే అతను తన చేతికి వికెట్లను తాకించాడు. ఇది రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ- థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌గా అక్షర్ వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికీ భారత్ స్కోర్ 31 పరుగులే.
చెత్త అంపైరింగ్‌పై..
థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మీరే అంపైర్లంటూ నిప్పులు చెరుగుతున్నారు. బంతి గాల్లో ఉన్న సమయంలో- ఉత్తి చేతులతో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. వికెట్లను గిరాటేశాడనే విషయం క్లియర్‌గా కనిపిస్తోన్నా గానీ.. అంపైర్లు గుడ్డిగా వ్యవహరించారంటూ విమర్శిస్తోన్నారు. ఇలాంటి చెత్త అంపైరింగ్ వల్ల ఇదివరకు టీమిండియా నష్టపోయిందంటూ గుర్తు చేస్తోన్నారు.


Click it and Unblock the Notifications












