
ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. తొలి ఓవర్లోనే శుభ్‌మన్ గిల్ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే అనవసరమైన షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ శర్మ (13) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0) మరోసారి విఫలమయ్యాడు. వన్డే జట్టులో చోటు నిలుపుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్న అతను.. ముంబైలో జరిగిన మ్యాచ్‌లో కూడా డకౌట్ అయ్యాడు. విశాఖలో కూడా అదే తరహాలో తొలి బంతికే పెవిలియన్ చేరాడు.
కేఎల్ రాహుల్ (9), హార్దిక్ పాండ్యా (1) కూడా ఫెయిలయ్యారు. ఇలా టీమిండియా మిడిలార్డర్ కుప్పకూలడం చూసిన అభిమానులు మండిపడుతున్నారు. సూర్య దారుణంగా ఫెయిలవడంతో అందరికీ మళ్లీ శ్రేయాస్ అయ్యర్ గుర్తొస్తున్నాడు. వన్డేల్లో చక్కగా రాణిస్తూ జట్టులో నాలుగో స్థానాన్ని పదిలం చేసుకున్న అయ్యర్.. వెన్నునొప్పితో ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. సూర్య స్థానంలో అయ్యర్ ఉండుంటే ఇన్నింగ్స్ చక్కిదిద్దే వాడని ఫ్యాన్స్ అంటున్నారు. అదే సమయంలో సూర్య టెక్నిక్ బాగలేదని, అందుకే అతను ఇలా అవుటవుతున్నాడని నిపుణులు వివరిస్తున్నారు.
ఇదంతా చూసిన ఫ్యాన్స్ మరోసారి బీసీసీఐ పక్షపాతాన్ని ఎత్తిచూపుతున్నారు. శ్రేయాస్ లేకపోతే నాలుగో స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించాలని, అతను కూడా మంచి ఫామ్ కనబరిచాడని గుర్తుచేస్తున్నారు. కానీ బీసీసీఐ మాత్రం వరుసగా విఫలం అవుతున్నా కూడా సూర్యనే ఆడిస్తూ సంజూకు మొండి చెయ్యి చూపుతోందని మండిపడుతున్నారు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో గాయపడిన సంజూ.. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కానీ అతనికి టీమిండియా నుంచి పిలుపు మాత్రం దక్కడం లేదు. వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో అతనికి కూడా చోటు దక్కే అవకాశం ఉందని ఈ ఏడాది ఆరంభంలో తెగ ప్రచారం జరిగింది. కానీ చివరకు ఎలాంటి కారణం లేకుండానే సంజూను సైడ్ చేసేయడం బాధాకరమని ఫ్యాన్స్ అంటున్నారు.