
వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం టీమిండియా జట్లను ప్రకటించింది. ఒకే సారి టెస్టు, వన్డే, టీ20లకు ఆటగాళ్లను ఎంపిక చేశారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ పర్యటనలో యువతకు పెద్దపీట వేశారు. ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, నవదీప్ సైనీ వంటి వారికి అవకాశం ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. దీంతో కొందరు క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగు ట్రోఫీలు అందించిన భారత ఓపెనర్ రోహిత్ శర్మను కెప్టెన్ ఎందుకు చేయట్లేదని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్‌లో సెమీస్‌లో గెలిచే అవకాశం ఉన్నా.. భారత్ ఓడిపోయింది. దీంతో కోహ్లీకి కాకుండా రోహిత్ శర్మకు సారధ్య భాద్యతలు అప్పగించాలని అంటున్నారు.
తీరికలేని క్రికెట్ ఆడుతున్న కోహ్లీ మొదటగా విండీస్ పర్యటనకు దూరంగా ఉంటాడని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో ప్రపంచకప్ సెమీస్ నుండి టీమిండియా నిష్క్రమించడంతో లిమిటెడ్ ఫార్మాట్, టెస్టు ఫార్మాట్‌లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీంతో మనసు మార్చుకున్న కోహ్లీ.. విశ్రాంతి అవసరం లేదని తేల్చేసాడు.
ఇప్పటికీ కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ... 'జట్టులో ఆటగాళ్ల మధ్య భేదాభిప్రాయాలు సహజమే' అని కొట్టిపారేశాడు. మరి ఎం జరుగుతుందో చూడాలి. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటించనుంది.