
హైదరాబాద్: తన కూతుర్ని ఏం చేయబోతున్నారు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. క్రికెట్ కామెంటేటర్‌గా ఆకాశ్ చోప్రాకి అందరికి సుపరిచితం. తన కూతురుతో ఇంట్లో క్రికెట్ ఆడుతున్న 59 సెకన్ల నిడివి గల ఓ చిన్న వీడియోను బుధవారం ట్విటర్‌లో పంచుకున్నారు.
"సీరియస్ వ్యవహారం" అని ఇంగ్లీషులో దానికి హ్యాష్‌ట్యాగ్ కూడా జత చేశారు. ఆ వీడియోలో తన కుమార్తెతో చోప్రా క్రికెట్ ఆడారు. తొలుత బంతులు సంధించిన చోప్రా కుమార్తె ఆ తర్వాత బ్యాటింగ్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని "క్రికెట్‌ను కెరీర్ ఎంచుకోవాలని మీరు ఆమెకు చెప్తారని అనుకోను" అని ప్రశ్నించారు.
అందుకు "ఆమెకు ఏదీ చెప్పను. తనకు రెక్కలున్నాయి. ఈ విశాల ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరేలా అవకాశం ఇస్తాం. అప్పుడామె కచ్చితంగా ఎగురుతుంది" అని ఆకాశ్ చోప్రా సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా చోప్రా తన ట్విట్టర్‌లో
ఉపయోగించిన పదాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి.
దీంతో చోప్రాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ తరఫున 10 టెస్టులాడిన ఆకాశ్ చోప్రా 437 పరుగులు చేశారు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 162 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10,839 పరుగులు చేశాడు. యావరేజి 45.35గా ఉంది. ఇందులో 29 సెంచరీలు ఉండగా... ఒక ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.